దేశీయ స్టాక్ మార్కెట్లు (stock markets) భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా, దేశీయంగా అందిన సానుకూల సంకేతాలతో స్టాక్ సూచీలు దూసుకెళ్లాయి. ఉదయం ఉత్సాహంగా లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ అదే జోరు కొనసాగించాయి. అమెరికాలో అక్టోబరు ద్రవ్యోల్భణం దిగిరావడం మార్కెట్లకు కలసి వచ్చిందని చెప్పవచ్చు. యూకేలోనూ ద్రవ్యోల్భణం కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అనుకూల సంకేతాలకుతోడు, ఇన్ఫోసిస్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటన్ కంపెనీల షేర్లు రాణించడంతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను చవిచూశాయి.
ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 742 పాయింట్లు లాభపడి 65675 వద్ద ముగిసింది. నిఫ్టీ 231 పాయింట్ల లాభంతో 19675 దగ్గర ముగిసింది. సెన్సెక్స్ 30 షేర్లలో ఇండస్ ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో ముగిశాయి. టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, విప్రో, టాటా స్టీల్, టీసీఎస్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిల్ టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాలను ఆర్జించాయి.