టీడీపీ నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జి మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్ రవి)ని మంగళవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో స్వాగతం పలకడానికి కడప విమానాశ్రయానికి పెద్ద సంఖ్యలో వచ్చి ఇబ్బందులు కలిగించారని అప్పట్లో బీటెక్ రవిపై (B.tech Ravi) కేసు నమోదైంది. పది నెలల తరవాత మంగళవారం రాత్రి బీటెక్ రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
యోగి వేమన విశ్వవిద్యాలయం వద్ద బీటెక్ రవిని అరెస్ట్ చేసి వ్యక్తిగత సహాయకుడు, గన్మెన్లను వదిలిపెట్టారు. రాత్రి పది గంటలకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కడపలో జడ్జి వద్ద హాజరు పరిచారు. బీటెక్ రవికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పాలకొల్లు చూడు అనే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రామానాయుడును పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు కూడా నిజం చెబుతాం అనే కార్యక్రమం చేపట్టడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఎక్కడికి తరలించారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.