స్టాక్ మార్కెట్లు జోష్ మీదున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుతోన్న సానుకూల సంకేతాలతో స్టాక్ సూచీలు భారీ లాభాలతో ప్రారంభం అయ్యాయి. బుధవారం ఉదయం సెన్సెక్స్ 560 పాయింట్ల (sensex) లాభంతో 65494 వద్ద ట్రేడింగ్ మొదలైంది. నిఫ్టీ 177 పాయింట్లు లాభపడి 19620 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.03 వద్ద మొదలైంది.
సెన్సెక్స్ 30 షేర్లలో ఏషియన్ పెయింట్స్, టైటన్, సన్‌ఫార్మా కంపెనీల షేర్లు నష్టాల్లో నడుస్తున్నాయి. టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, హెచ్‌సీఎల్ టెక్ కంపెనీల షేర్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి.
యూఎస్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. రిటైల్ ద్రవ్యోల్భణం ఐదు నెలల కనిష్ఠానికి దిగిరావడం మార్కెట్లకు ఊతం ఇచ్చింది. ఆసియా మార్కెట్లు సానుకూలంగా ప్రారంభం అయ్యాయి. టోకు ధరల సూచీ ఏడో నెలా ప్రతిద్రవ్యోల్భణం నమోదు చేసింది. పలు కంపెనీలు త్రైమాసిన ఫలితాల్లో భారీ లాభాలను ప్రకటించడం కూడా స్టాక్ మార్కెట్లకు సానుకూల సంకేతాలు అందించినట్లైంది.