నిత్యావసరాల ధరలు పెరిగాయని జనం గగ్గోలు పెడుతుంటే, తాజాగా కేంద్రం ప్రకటించిన రిపోర్ట్ మాత్రం ధరలు తగ్గాయని సూచిస్తోంది. దేశంలో ధరలను ప్రతిబింబించే ద్రవ్యోల్భణం (inflation) దిగివచ్చింది. తాజా రిపోర్టుల ప్రకారం దేశంలో ద్రవ్యోల్భణం ఐదు నెలల కనిష్టానికి తగ్గింది.తృణధాన్యాలు, పండ్లు, పప్పుల ధరలు పెరగ్గా, వంటనూనెలు, ఇంధన ధరలు దిగివచ్చాయి. వినియోగదారుల ద్రవ్యోల్భణం తొమ్మిది పెద్ద రాష్ట్రాల్లో జాతీయ సగటు కన్నా ఎక్కువగా నమోదైంది.
జాతీయ సగటుకన్నా ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో రాజస్థాన్, హర్యానా, గుజరాత్, తెలంగాణ ఉన్నాయి. వీటిలో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం అధికార పార్టీలను కలవరపెడుతోంది.ఏడు రాష్ట్రాల్లో గ్రామీణ ద్రవ్యోల్భణం జాతీయ సగటు కంటే ఎక్కువగా నమోదైంది.
బిహార్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్లలో మాత్రం గ్రామీణ ద్రవ్యోల్భణం జాతీయ సగటు కంటే తక్కువ నమోదైంది. అక్టోబరు మాసంలో ఇంధనం, వంట నూనెల ధరలు దిగివచ్చాయి. కూరగాయలు, రవాణా, కమ్యూనికేషన్స్ ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది.
అభివృద్ధి చెందిన దేశాల్లో ద్రవ్యోల్భణం తీరుపై ది ఎకనామిస్ట్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. 2022లో కంటే, ఈ ఏడాది ద్రవ్యోల్భణం స్థిరంగా ఉందని తెలిపింది. అమెరికా, కెనడా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాల్లో ద్రవ్యోల్భణం సవాల్ విసురుతోందని తెలిపింది. ఇటలీ, స్పెయిన్, జపాన్, దక్షిణ కొరియా దేశాల్లో మెరుగ్గా ఉందని ప్రచురించింది.