ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు పలు పార్టీలు హామీలతో ప్రజలను ముంచెత్తుతున్నాయి. మధ్యప్రదేశ్లో తాము మరలా అధికారంలోకి వస్తే ఉచితంగా అయోధ్య (ayodya) దర్శనానికి తీసుకెళతామని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. వచ్చే జనవరిలో అయోధ్యలో రామాలయం భక్తులకు అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అయోధ్య రామాలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు ఎంతో ఉత్సుకతతో ఉన్నారు.
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నేత అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అయోధ్యలో రామ మందిరం ఎప్పుడు ప్రారంభిస్తారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారని ఆయన గుర్తు చేశారు. 2024 జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందని అమిత్ షా వెల్లడించారు.
అయోధ్య దర్శనానికి తాము డబ్బులు ఖర్చు చేయాలా అని ఓ బీజేపీ సీనియర్ నేత అమిత్ షాను ప్రశ్నించారు. వెంటనే స్పందించిన అమిత్ షా, తాము మధ్యప్రదేశ్లో మరలా అధికారంలోకి వస్తే అయోధ్య దర్శనం ఉచితంగా కల్పిస్తామని హామీ ఇచ్చారు.