తెలంగాణ
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా
నామినేషన్ల ఘట్టం ముగియడంతో అభ్యర్థుల ఆస్తుల విషయాలు బయటకు వస్తున్నాయి. నామినేషన్
సందర్భంగా అందజేసిన అఫిడవిట్ లో ఆస్తులతో పాటు అప్పుల వివరాలు పొందుపరచడంతో ఆయా రాజకీయ పార్టీల్లోని ధనిక అభ్యర్థుల గురించి
తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా చర్చించుకుంటున్నారు.
చెన్నూరు
నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న మాజీ ఎంపీ గడ్డం వివేకానంద అత్యంత సంపన్నుడైన
అభ్యర్థిగా ప్రచారం జరుగుతోంది. ఆయన వ్యక్తిగత ఆస్తితో పాటు కుటుంబ సభ్యుల ఆస్తి
రూ. 600 కోట్లు ఉన్నట్లు ఎన్నికల నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ లో
పేర్కొన్నారు.
వివేకానంద తర్వాతి స్థానంలో కాంగ్రెస్ పార్టీకి చెందని మరో అభ్యర్థి
పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెండో స్థానంలో ఉన్నారు. పొంగులేటి కూడా గతంలో ఎంపీగా
పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజవకర్గం నుంచి హస్తం
గుర్తుపై పోటీ చేస్తున్నారు.
వివేక్
తోపాటు ఆయన భార్యకు ఉన్న చరాస్తుల విలువ రూ. 337 కోట్లు. స్థిర ఆస్తుల విలువ రూ.
225 కోట్లగా అఫిడవిట్ లో చూపారు. విశాక ఇండస్ట్రీలో
వారికి ఎక్కువ షేర్లు ఉన్నాయి. ఈ కంపెనీని వారు 1981లో స్థాపించారు. అలాగే రూ.
41.5 కోట్ల అప్పులు ఉన్నట్లు చూపారు. వివేక్ వార్షిక ఆదాయం రూ. 6.26 కోట్లుగా ఉంది.
ఇక
అఫిడివిట్ లో పేర్కొన్న మేరకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆస్తుల వివరాలు
పరిశీలిస్తే, చర, స్థిర ఆస్తుల విలువ రూ. 460 కోట్లు ఉండగా, రూ. 44 కోట్ల అప్పులు
ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల ఆయన
కంపెనీలు, నివాసాల్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. రాజకీయ కక్షతోనే తనపై ఐటీ
దాడులు జరిగాయని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.
మునుగోడు
అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో ఉన్న మరో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్
రెడ్డి ఆస్తుల విలువ రూ. 459 కోట్లు, ఆయన వార్షిక ఆదాయం రూ. 36.6 కోట్లుగా
అఫిడవిట్ లో చూపారు. సుషీ ఇన్ ఫ్రా కంపెనీలో ఆయనకు షేర్లు ఉన్నాయి. అప్పులు రూ.
4.14 కోట్లు.
బీఆర్ఎస్
తరఫున పోటీలో ఉన్న పైలా శేఖర్ రెడ్డి ఆస్తుల విలువ రూ. 227 కోట్లు కాగా అప్పులు
రూ. 83 కోట్లు.
తెలంగాణ సీఎం, బీఆర్ఎస్
అధ్యక్షుడు కేసీఆర్ ఆస్తుల విలువ రూ. 59 కోట్లు ఉంటుందని ఎన్నికల అఫిడవిట్ లో
పేర్కొన్నారు. తనకు సొంత కారు కూడా లేదని కేసీఆర్ పేర్కొన్నారు.