గాజా(Gaza)లో ఆసుపత్రులు, పౌరులను అడ్డుపెట్టుకుని దాడులు చేస్తున్న హమాస్
తీరును యూరోపియన్ యూనియన్(EU)
తప్పుబట్టింది. యుద్ధం జరుగుతున్న ప్రాంతం నుంచి
పౌరులు సురక్షితంగా బయటపడేలా చర్యలు చేపట్టాలని సూచించింది.
ఉత్తరగాజాపై హమాస్ పట్టు కోల్పోయిందని
ఇప్పటికే ప్రకటించిన ఇజ్రాయెల్ ప్రధాని
నెతన్యాహు, తీవ్రవాదులను పూర్తిగా తుడిచివేసి బందీలను కాపాడతామని పేర్కొన్నారు. మరోవైపు
ఉత్తర గాజాలో ఉన్న పలు ఆసుపత్రులను ఐడీఎఫ్ దళాలు చుట్టుముట్టాయి.
‘‘ప్రజలను, ఆసుపత్రులను హమాస్ రక్షణ కవచాలుగా
ఉపయోగించుకోవడాన్ని ఖండిస్తున్నాం. యుద్ధం జరుగుతున్న ప్రాంతాల నుంచి ప్రజలు
సురక్షితంగా మరోచోటుకి వెళ్లేందుకు
సహకరించాలి’’ అని ఈయూ విదేశాంగ విధాన చీఫ్ జోసెఫ్ బోరెల్ ఓ ప్రకటన విడుదల చేశారు. పౌరులను రక్షించేందుకు
చేపట్టే చర్యల్లో ఇజ్రాయెల్ కూడా సంయమనం పాటించాలని కోరింది.
అంతర్జాతీయ మానవతా చట్టాల మేరకు ఆసుపత్రుల్లో
చికిత్స పొందుతున్న వారిని రక్షించడానికి, మందుల
సరఫరా చేసేందుకు ఆటంకం లేకుండా వ్యవహరించాలని సూచించింది.
శత్రుత్వాలు ఆసుపత్రులపై తీవ్ర ప్రభావం
చూపుతున్నాయని,
పౌరులు, వైద్య సిబ్బంది తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆసుపత్రుల కింద, సమీప ప్రాంతాల్లో హమాస్ కమాండ్ సెంటర్‌లు
ఏర్పాటు చేసిందని ఇజ్రాయెల్ చేస్తోన్న ఆరోపణలను హమాస్ ఖండించింది.