ఏపీలో మద్యంప్రియుల అరాచకాలకు అంతే లేకుండా పోతోంది. తాజాగా అడిగిన మద్యం బ్రాండ్ ఇవ్వలేదని ఓ మందుబాబు దుకాణానికే నిప్పు పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. విశాఖలోని కొమ్మాది జంక్షన్ సమీపంలో ఆదివారం ఓ మందుబాబు అడిగిన బ్రాండ్ ఇవ్వలేదని షాపుకే నిప్పు పెట్టాడని పోలీసులు తెలిపారు.
విశాఖ నగరంలోని కొమ్మాది సాయిరాం కాలనీకి చెందిన గుమ్మడి మధు మద్యం సేవించి వైన్ దుకాణం (crime news) వద్దకు వచ్చాడు. షాపులో లేని బ్రాండు అడగడంతో సిబ్బంది లేదని చెప్పారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మధు, లీటర్ బాటిల్లో పెట్రోల్ తెచ్చి షాపులో చల్లి నిప్పు పెట్టాడు. ఈ ఘటనలో రూ.2 లక్షల ఆస్తినష్టం వాటిల్లిందని పోలీసులు చెప్పారు. మద్యం బాటిళ్లు కంప్యూటర్, ప్రింటర్, స్కానర్, ఫ్రిజ్ కాలిపోయాయి. దుకాణం సిబ్బంది భయంతో పరుగులు తీశారు. స్థానికులు మధును పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.