ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బ్రహ్మఖల్-యమునోత్రి జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ఉత్తరకాశీ జిల్లాలో సొరంగం పనులు జరుగుతున్నాయి. నిన్న ఉదయం 5 గంటలకు సొరంగం కప్పు కూలిపోవడంతో అందులో పనిచేస్తోన్న 40 మంది కార్మికులు (40 Workers Trapped In Uttarakhand Tunnel) చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ సిబ్బంది, స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్, స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. సొరంగం కప్పు పాక్షింకంగా కూలిపోవడంతో కార్మికులంతా ప్రాణాలతో ఉన్నారని భావిస్తున్నారు.
సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులకు ఆక్సిజన్, నీరు, ఆహారం పైపుల ద్వారా పంపిస్తున్నట్లు స్థానిక పోలీస్ అధికారి ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. అందరూ సురక్షితంగా ఉన్నారని వారితో సంప్రదింపులు జరుపుతున్నామని కుమార్ తెలిపారు.
ఎస్కేప్ మార్గం ఏర్పాటు చేసేందుకు 20 మీటర్లు సొరంగం కప్పు తొలగించారు. ఇంకా 35 మీటర్లు తొలగించాల్సి ఉంది. భారీ యంత్రాల సాయంతో కూలిన సొరంగం కప్పును తొలగిస్తున్నట్లు ప్రశాంత్ కుమార్ చెప్పారు.
ఉత్తరాఖండ్‌లోని సిల్క్వారాను దండల్గావ్తో అనుసంధానం చేయడానికి ఈ సొరంగం తవ్వుతున్నట్లు ప్రాజెక్టు అధికారి తెలిపారు. ఈ పనులు పూర్తైతే ఉత్తరకాశీ నుంచి యమునోత్రికి 26 కి.మీ దూరం తగ్గుతుంది. సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులంతా బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల వారని అధికారులు తెలిపారు.