గత నెలలో ఇజ్రాయెల్‌పై హమాస్ (israel hamas war) ఉగ్రదాడులు మొదలైన తరవాత అది భీకర యుద్ధంగా మారింది. ఇప్పటికే ఇజ్రాయెల్ హమాస్ పోరులో 11 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా గాజాలో ఆసుపత్రులు, బడులు లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులకు దిగుతోందనే విమర్శల నేపథ్యంలో ఆ దేశం స్పందించింది. హమాస్ ఉగ్రవాదులు పాఠశాలల్లో ఆయుధాలు నిల్వ చేస్తున్నారని ఇజ్రాయెల్ రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఉత్తర గాజాలోని గజాన్ కిండర్ గార్డెన్ పాఠశాల లోపల ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలను గుర్తించినట్లు ఐడీఎఫ్ దళాలు ప్రకటించాయి. పాఠశాలల్లో ఆయుధాలను స్వాధీనం చేసుకుని నాశనం చేసినట్లు ఐడీఎఫ్ అధికారి ఒకరు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఒక పాఠశాలలో ఆయుధాలతోపాటు, భూగర్భ మార్గాలను కూడా గుర్తించినట్లు ఐడీఎఫ్ తెలిపింది.
గాజాలో హమాస్‌ను పూర్తి తుడిచిపెట్టే వరకు కాల్పుల విరమణకు అవకాశం లేదని ఇజ్రాయెల్ ప్రకటించింది. గాజాను స్వాధీనం చేసుకునే ఆలోచన తమకు లేదని కూడా ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ప్రకటించారు.