Deepavali – Crackers – Pollution : Facts 1
టపాసులు కాల్చడం వల్ల కలిగే
కాలుష్యం, ప్రత్యేకించి దీపావళి సందర్భంలో, అన్న అంశం కొన్నేళ్ళుగా విస్తృత
చర్చనీయాంశంగా నిలుస్తోంది. ఈ విషయం మీద జరిగిన అధ్యయనాలు, విశ్లేషణలను పరిశీలిస్తే
చాలా విషయాలు ప్రజాబాహుళ్యం దృష్టిలోకి రాలేదన్న నిజం విస్మయం కలిగిస్తుంది.
ఆఖరికి సుప్రీంకోర్టులో జరిగిన వాదోపవాదాల గురించి కూడా పెద్దగా చాలామందికి
తెలియదు. ఈ అంశంలోని నిజానిజాల గురించి ఐదు భాగాల్లో వివరంగా తెలుసుకుందాం.
ఢిల్లీలో వాయుకాలుష్యంపై
కేసుతో దేశమంతా బాణాసంచాపై నిషేధమా?
ఈ విషయాన్ని అర్ధం
చేసుకోడానికి మనం మొదట సుప్రీంకోర్టు కేసు పూర్వాపరాలను ఒకసారి చూద్దాం.
2015 అక్టోబర్ 5: ఢిల్లీలో
వాయుకాలుష్యానికి కారణాలను నిరోధించాలంటూ ప్రజాహితవ్యాజ్యం నమోదయింది.
2015 అక్టోబర్ 16: బాణాసంచా
దుష్ప్రభావం గురించి ప్రజలకు తెలియజేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
బాణాసంచా కొనకూడదు, కాల్చకూడదని విద్యార్ధులందరికీ చెప్పాలని ఉపాధ్యాయులు అందరికీ
సూచించింది.
2016 నవంబర్ 11: ఢిల్లీలో
వాయుకాలుష్యం తీవ్రస్థాయికి చేరడంతో అక్కడి ప్రభుత్వం రాజధానిలో బాణాసంచా అమ్మకాలను,
టపాసులు అమ్మే దుకాణాల లైసెన్సులనూ సస్పెండ్ చేసింది.
2017 సెప్టెంబర్ 12: టపాసుల దుకాణాల
లైసెన్సులన్నీ సస్పెండ్ చేయడం తీవ్రమైన చర్య అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సస్పెన్షన్‌ను
ఎత్తివేస్తూనే లైసెన్సుల సంఖ్యను సగానికి సగం తగ్గించింది.
2017 అక్టోబర్ 9:
సుప్రీంకోర్టు మరోబెంచ్, పై ఉత్తర్వును తిరగరాసింది.
సరిగ్గా దీపావళికి కొద్దిరోజుల ముందు ఢిల్లీలో బాణాసంచా అమ్మకాలను నిషేధించింది. అయితే,
దీపావళి పండుగ అయిపోయిన వెంటనే నవంబర్ 1న అదే బెంచ్ ఆ నిషేధాన్ని తొలగించింది.
2018 అక్టోబర్ 23: గ్రీన్
క్రాకర్స్ మినహా అన్ని టపాసులనూ దేశవ్యాప్తంగా నిషేధించారు. గ్రీన్ క్రాకర్స్‌ను
సైతం దీపావళి రాత్రి 8 నుంచి 10 గంటల వరకూ అంటే కేవలం రెండు గంటలు మాత్రమే
కాల్చుకోడానికి అనుమతించింది.
2020 మార్చి 3: గ్రీన్
క్రాకర్స్ ఉత్పత్తిదారులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారన్న ఫిర్యాదు మేరకు కోర్టు
సీబీఐ విచారణకు ఆదేశించింది. ఆ నివేదిక ఇంకా రావలసి ఉంది.
ఈ కేసులు, విచారణ,
న్యాయస్థానం తీర్పులు… వీటిని పరిశీలిస్తే కొన్ని విషయాలు అర్ధమవుతాయి.
1. ఢిల్లీలో వాయుకాలుష్యం
కారణాలు, నివారణ పేరిట పిటిషన్ వేసినప్పటికీ, నిజానికి పిటిషనర్లు, న్యాయస్థానం
కూడా బాణాసంచాను నియంత్రించడం మీదనే తమ మొత్తం దృష్టి సారించారు.
2. టపాసులను నిషేధించడం మీద
ఎంతగా దృష్టి కేంద్రీకరించారంటే, వాయుకాలుష్యానికి మరే ఇతర కారణాలనూ గుర్తించదగిన
స్థాయిలో కనీసం చర్చించలేదు, వాటిపై ఎలాంటి దర్యాప్తూ జరపలేదు.
3. న్యాయస్థానం మొదటినుంచీ
టపాసులకు వ్యతిరేకంగానే వ్యవహరించాలని భావించినట్లు అర్ధమవుతోంది. 2015 అక్టోబర్
16 నాటి ఉత్తర్వులు చూస్తే ఆ విషయం సుస్పష్టమవుతోంది. కేసు విచారణ ఇంకా తొలిదశలో
ఉండగానే, బాణాసంచా వల్లనే కాలుష్యం అని నిర్ధారించగల శాస్త్రీయమైన, పరిగణనీయమైన
సమాచారం ఏమీ లేకుండానే, ‘బాణాసంచా వల్ల దుష్ప్రభావాలు’ అని విస్తృతంగా ప్రచారం
చేయాలంటూ కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించడం దాన్ని నిర్ధారిస్తోంది.
4. దీపావళి నాడు ఉపయోగించే
బాణాసంచాను నిషేధించాలి అన్న విషయం మీద దేశవ్యాప్తంగా ఏకాభిప్రాయం ఉన్నట్లుగా
న్యాయస్థానాన్ని నమ్మించే ప్రయత్నాలు జరిగాయి.
5. ఊహాజనితమైన ‘దేశవ్యాప్త ఏకాభిప్రాయాన్నే’
ప్రమాణంగా చూపుతూ, వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి గ్రీన్ క్రాకర్స్ వినియోగం ఒక్కటే
మార్గం అంటూ పర్యావరణ శాఖ ప్రతిపాదించడం చివరి దెబ్బ.
6. పర్యావరణశాఖ చేసిన
సిఫార్సులను ఆమోదిస్తూ సుప్రీంకోర్టు 2018 అక్టోబర్ 23న తుదితీర్పు ఇచ్చింది.
దీన్నిబట్టి, ఈ కేసులో
పిటిషనర్ల నిజమైన ఉద్దేశం ఢిల్లీలో వాయుకాలుష్యాన్ని తగ్గించడం కాదనీ, కేవలం ఆ
ముసుగులో దేశమంతటా బాణాసంచాను నిషేధింపజేయడమనీ అర్ధమవుతుంది.
పిటిషనర్లు అలాంటి నిషేధం కోరుకోడదానికి
కారణాలేమిటి, వాళ్ళ ఉద్దేశాలేమిటి, ఆ కేసును వాదించడానికి అభిషేక్ మను సింఘ్వీ,
కపిల్ సిబల్, కెకె వేణుగోపాల్ వంటి అగ్రశ్రేణి న్యాయవాదులకు చెల్లించడానికి నిధులు
ఎక్కడినుంచి వచ్చాయి వంటి ప్రశ్నలకు జవాబులు ప్రత్యక్షంగా దొరకవు.
ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే,
ఈ కేసులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న ప్రతీ సందర్భంలోనూ భారత ప్రభుత్వం,
పర్యావరణ శాఖ ద్వారా, ఆ జోక్యానికి మద్దతు పలికింది. నిజానికి ఈ కేసు విచారణ
సమయంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉందన్న సంగతి జీర్ణించుకోవడం చాలామందికి
కష్టమే కావచ్చు. దీపావళి వేళ బాణాసంచా వినియోగంపై ఆంక్షలు, కార్యనిర్వాహక వ్యవస్థ పరిధిలోకి న్యాయవ్యవస్థ
చొరబాటు మాత్రమే కాదు, నిజానికి ప్రభుత్వానికీ న్యాయవ్యవస్థకూ మధ్య ఒప్పందం అని
చెప్పుకోవచ్చు.
ప్రభుత్వం-న్యాయవ్యవస్థల నిర్ణయాన్ని
ప్రజలు ఒప్పుకున్నారా అన్నది పూర్తిగా వేరే విషయం.