శ్రీరాముడి
జన్మభూమి అయోధ్య, దీపావళి సంబరాలకు సుందరంగా ముస్తాబైంది. సుగుణాభిరాముడు వేంచేసిన
సరయూ నది ఒడ్డున 51 ఘాట్లలో ఏకకాలంలో 24
లక్షల దీపాలు వెలిగించనున్నారు. ఈ అపూర్వఘట్టం ప్రపంచ ఘనత సాధించబోతుంది.
రామాయణంలోని
పలు సంఘటనల ఆధారంగా వివిధ నృత్య, సంగీత కార్యక్రమాలను కళాకారులు
ప్రదర్శిస్తున్నారు. రామాయణంలోని వివిధ
పాత్రలతో కూడిన శకటాలు రామకథా పార్కుకు ఊరేగింపుగా చేరుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని
ఉత్తర ప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి జైవీర్ సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. వివిధ
ప్రాంతాల్లో పేరొందిన నృత్యరీతులు ప్రదర్శిస్తారు. గార్బా, దోయి తాషా, దోబియా,
కుల్లునాటి వంటి దేశీయ నృత్యరీతులు ఆహూతులను అలరిస్తున్నాయి.
సైకత శిల్పాలు,
రాముడి నామస్మరణతో అయోధ్యలో సందడి వాతావరణం నెలకొంది.
యూపీ
సీఎం యోగీ ఆదిత్యనాథ్ తో పాటు దేశ, విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ
కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు.
గవర్నర్,
ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో రాముడిని తోడ్కొని వస్తారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
సాయంత్రం 6.30 గంటలకు సరయూ హారతి నిర్వహిస్తారు. అనంతరం నది ఒడ్డున ఉన్న
దీపోత్సవాన్ని ప్రారంభిస్తారు. సీఎం యోగీ నేడు అయోధ్యలోనే బస చేస్తారు.
శ్రీరాముడి
చిన్ననాటి నుంచి లంకకు వెళ్లే వరకు రాముడి విజయ యాత్రను వివిధ కళారీతుల ద్వారా కళాకారులు
ప్రదర్శించారు.