అసెంబ్లీలు ఆమోదించి పంపిన బిల్లులకు ఆమోదం తెలపకుండా గవర్నర్లు ఆలస్యం చేస్తున్నారంటూ కొన్ని రాష్ట్రాలు సుప్రీంకోర్టులో (supreme court) పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పంజాబ్ ప్రభుత్వం, ఆ రాష్ట్ర గవర్నర్ మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన తీవ్ర ఆందోళన కలిగించే అంశమని సుప్రీంకోర్టు పేర్కొంది. మీరు నిప్పుతో ఆడుతున్నారంటూ పంజాబ్ గవర్నర్ను ఉద్దేశించి సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. బిల్లుల ఆమోదంలో ఆలస్యం చేయవద్దని సూచించింది.
అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులను గవర్నర్ ఆలస్యం చేస్తున్నారంటూ పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. గవర్నర్లు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించింది.అసెంబ్లీ సమావేశం రాజ్యాంగ విరుద్దం అంటూ పంజాబ్ గవర్నర్ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది.బిల్లుల జాప్యంపై గవర్నర్లు ఆత్మపరిశీలన చేసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.