తెలంగాణ అసెంబ్లీ బరిలో (telangana bjp list) నిలిచే అభ్యర్థుల చివరి జాబితాను బీజేపీ ప్రకటించింది. 14 మందితో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఈ జాబితాను విడుదల చేసింది. దీంతో తెలంగాణలోని మొత్తం 119 స్థానాల్లో బీజేపీ 111 స్థానాల్లో పోటీ చేయనుంది. జనసేనకు 8 స్థానాలు కేటాయించారు. మల్కాజ్గిరి నుంచి బీజేపీ సీనియర్ నేత రామచంద్రరావు, సంగారెడ్డి నుంచి దేశ్‌పాండే రాజేశ్వర్‌రావు బరిలో నిలవనున్నారు. రామచంద్రరావు హైదరాబాద్ నగర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. బీజేపీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా కూడా చేస్తున్నారు. సీనియర్ న్యాయవాదైన రామచంద్రరావు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యుడు. రంగారెడ్డి, మహబూబాబాద్ గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీగా కూడా చేశారు.
బెల్లంపల్లి నుంచి కొయ్యల ఎమ్మాజీ, పెద్దపల్లి నుంచి దుగ్యాల ప్రదీప్, మేడ్చెల్ ఏనుగు సుదర్శన్‌రెడ్డి, శేరిలింగంపల్లి రవి కుమార్ యాదవ్, నాంపల్లి రాహుల్ చంద్ర, చాంద్రాయణగుట్ట కె.మహేందర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ గణేశ్ నారాయణ్, దేవరకద్ర కొండా ప్రశాంత్ రెడ్డి, వనపర్తి అనుగ్నరెడ్డి, ఆలంపూర్ మీరమ్మ, నర్సంపేట్ కె.పుల్లారావు, మధిర పెరుమార్పల్లి విజయ రాజు పేర్లు ప్రకటించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. ఇప్పటికే అన్ని పార్టీల నేతలు ప్రచారంలో తలమునకలై ఉన్నారు. ప్రధాని మోదీ తెలంగాణలో రేపు మరోసారి ఎన్నికల ప్రచార బహిరంగసభలో పాల్గోనున్నారు.