రోడ్లపైన అక్కడక్కడా ఎవరో పొరపాటున పారేసుకున్న వందో రెండొందలో దొరకడం సహజంగా చూస్తూ ఉంటాం. కానీ చెత్త కుప్పలో ఏకంగా రూ.25 కోట్లు దొరికాయంటే నమ్మశక్యంగా లేదు. అది కూడా బెంగళూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సల్మాన్ షేక్ అనే వ్యక్తి బెంగళూరు శివారులో చెత్త ఏరుకుంటుండగా 23 కట్టల అమెరికన్ డాలర్లు (crime news) దొరికాయి. ఆందోళనకు గురైన సల్మాన్ వాటిని తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. కొద్ది రోజుల తరవాత అతని యజమాని బప్పాకి అప్పగించాడు.
బప్పా కూడా ఆ డబ్బును దాచుకోలేదు. వెంటనే సామాజిక కార్యకర్త కలిముల్లాని తీసుకుని వెళ్లి పోలీస్ కమిషనర్ దయానందకు విషయం చెప్పారు. వెంటనే పోలీసులు డాలర్ కట్టలను స్వాధీనం చేసుకున్నారు. నోట్లపై రకరకాల రసాయనాలు పూసినట్లు పోలీసులు గుర్తించారు. బ్లాక్ డాలర్ స్కామ్‌కు పాల్పడుతున్న ముఠాకి చెందిన పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అసలు అవి అసలైనవా? నకిలీ నోట్లా అనేది తేలాల్సి ఉంది. స్వాధీనం చేసుకున్న 23 కట్టలను పోలీసులు ఆర్బీఐకి పంపించారు.