ప్రజాప్రతినిధులపై కేసుల విచారణపై సుప్రీంకోర్టు (supreme court) కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణ త్వరగా పూర్తి చేసేందుకు ప్రత్యేక బెంచ్‌లు ఏర్పాటు చేయాలని హైకోర్టులను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రజాప్రతినిధులపై కేసులు సత్వరమే విచారణ పూర్తిచేయాలంటూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ వేసిన పిటీషన్‌పై గురువారంనాడు సుప్రీంకోర్టు సీజేఐ ధర్మాసనం విచారణ జరిపింది. ప్రజాప్రతినిధుల కేసుల విచారణకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన ప్రత్యేక బెంచ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
క్రిమినల్ కేసుల సత్వర విచారణకు అవసరమైన పర్యవేక్షణ కోరుతూ సుమోటో కేసులు నమోదు చేయాలని కూడా హైకోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ట్రయల్ కోర్టులు అత్యవసరం అయితే తప్ప ప్రజాప్రతినిధులపై కేసుల విచారణలను వాయిదా వేయకూడదని కూడా ఆదేశాల్లో పేర్కొంది. కేసుల వివరాలను కూడా హైకోర్టుల వెబ్సైట్లలో అందుబాటులో ఉంచాలని కోరింది. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.