Bharat US Defence Ministers to meet tomorrow
అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్
ఆస్టిన్ రెండు రోజుల పర్యటన కోసం భారత్ చేరుకున్నారు. భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్
సింగ్ ఆయనకు స్వాగతం పలికారు. భారత్ నుంచి ఆయన కొరియా, ఇండోనేషియా వెడతారు.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఆస్టిన్ పర్యటించడం ఇది తొమ్మిదో సారి.
ఐదవ భారత్-అమెరికా 2+2 మంత్రుల స్థాయి సమావేశాలు రేపు జరగనున్నాయి. ప్రధానమైన రక్షణ శాఖ,
విదేశాంగ శాఖల మంత్రులు చర్చలు జరుపుతారు. రక్షణ శాఖకు సంబంధించి భారత్ తరఫున రాజ్‌నాథ్
సింగ్, అమెరికా తరఫున లాయిడ్ ఆస్టిన్ చర్చల్లో పాల్గొంటారు. అలాగే విదేశాంగశాఖకు
సంబంధించి ఎస్ జయశంకర్, ఆంటోనీ బ్లింకెన్ చర్చిస్తారు. రెండు మంత్రిత్వ శాఖల
ఉన్నతాధికారులు కూడా ఆ చర్చల్లో పాల్గొంటారు.
రక్షణ శాఖ మంత్రుల సమావేశం రేపు 9వ
తేదీన జరుగుతుంది. విదేశాంగ మంత్రుల సమావేశం 10వ తేదీన జరుగుతుంది. అమెరికా
విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్ రేపు ఢిల్లీకి చేరుకుంటారు. ఇరుదేశాల రెండు శాఖల మంత్రులు
ద్వైపాక్షిక వ్యవహారాలతో పాటు అంతర్జాతీయ పరిణామాల పైన కూడా చర్చలు జరుపుతారు.
కరోనా మహమ్మారి తగ్గుతూ ప్రపంచం
సాధారణ స్థితికి చేరుకోవడం మొదలవుతున్న దశలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఆ వెంటనే
పాలస్తీనా-ఇజ్రాయెల్ యుద్ధం… ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసేసాయి.
ఐరోపా, అమెరికా ఖండాల్లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరే అవకాశం కనుచూపుమేరలో
కనిపించడం లేదు. మరోవైపు, భారత్ కూడా అవే పరిణామాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నా
ఆర్థికంగా అంత తీవ్రమైన సమస్యల్లో లేదు. పైగా కొద్దోగొప్పో ఇతరదేశాలకు సహాయం చేసే
స్థాయిలోనే నిలబడగలిగింది. మరోవైపు, రెండు యుద్ధాలూ ప్రపంచదేశాలన్నీ ఏదో ఒక
కచ్చితమైన వైఖరి తీసుకోవలసిన పరిస్థితి. ముఖ్యంగా అమెరికా అన్ని దేశాలనూ తమ విధానాలనే
అనుసరించాలని ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఒత్తిడి చేస్తోంది.
అలాంటి ఒత్తిడులకు భారతదేశం లొంగడం
లేదు. దేశ ప్రయోజనాలే పరమావధిగా కచ్చితమైన వైఖరితో ఉంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ
సమయంలో ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వాలని అమెరికా పలుదేశాలపై ఒత్తిడి చేసి, సాధించింది
కూడా. భారత్ విషయంలో ఆ పప్పులు ఉడకలేదు. రష్యాతో సంబంధాలను తెగదెంపులు చేసుకోమంటూ
అమెరికా తెచ్చిన ఒత్తిడికి భారత్ తలొగ్గలేదు. రష్యా నుంచి ఇంధనం కొనడం,
ఐక్యరాజ్యసమితిలో తటస్థ వైఖరి అనుసరించడం వంటి నిర్ణయాలను భారత్ స్వతంత్రంగా
తీసుకుంది. పైగా, భారత్‌పై చేసిన విమర్శలకు సైతం దీటుగా జవాబిచ్చింది. అలాగే
పాలస్తీనా-ఇజ్రాయెల్ విషయంలోనూ స్వతంత్రంగా వ్యవహరిస్తోంది. అందుకే అమెరికా,
లోపల ఎలా ఉన్నా, బైటకు మాత్రం భారత్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుంది అనే
చెబుతోంది. మరోవైపు తమకు పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న చైనాను
నియంత్రించేందుకు, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రాదేశిక ఆధిపత్యాన్ని సాధించేందుకు,
అమెరికా భారత్‌ను పూర్తిగా వ్యతిరేకించలేని పరిస్థితి. నిజానికి ఈ వాతావరణం భారత్‌కు
కూడా కత్తిమీద సామే.
సంక్లిష్ట అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో భారత్-అమెరికా
మంత్రుల స్థాయి సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.