రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో తెలంగాణలో కోలాహలం నెలకొంది. తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (kcr nomination) రెండు స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. ఉదయం గజ్వేల్ నియోజకవర్గంలో, మధ్యాహ్నం కామారెడ్డిలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. గజ్వేల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి కేసీఆర్ రెండు సెట్ల నామినేషన్ పత్రాలు ఇచ్చారు. కామారెడ్డి ఆర్డీవో కార్యాలయంలోనూ నామినేషన్ దాఖలు చేశారు. కేసీఆర్ నామినేషన్ కార్యక్రమంలో వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
మంత్రులు కేటీఆర్, హరీష్రావు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. సిద్దిపేటలో మంత్రి కేటీఆర్ నామినేషన్ వేయగా, సిరిసిల్లలో హరీష్రావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు.
నామినేషన్ కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. నామినేషన్ కార్యక్రమానికి ర్యాలీగా కేటీఆర్ ప్రచారం రథంపై వెళుతుండగా, డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో మంత్రి కేటీఆర్ సహా పలువురు నేతలు కింద పడ్డారు. కేటీఆర్కు తృటిలో ప్రమాదం తప్పడంతో కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు.