అనకాపల్లి జిల్లాలో సైనికుడి పట్ల దురుసుగా
ప్రవర్తించిన నలుగురు పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలని డీజీపీ రాజేంద్రనాథ్
రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత డీఐజీ, ఎస్పీకి సమాచారం అందించారు.
అనకాపల్లి
జిల్లా పరవాడ మండలం, సంతబయలులో నలుగురు పోలీసు సిబ్బంది స్థానికుల
మొబైల్స్ లో దిశ యాప్ ఇన్ స్టాల్ చేస్తున్నారు. ఈ క్రమంలో అటుగా వచ్చిన ఓ
సైనికుడిని ఆపి మొబైల్ ఇవ్వాలని కోరారు. అయితే పోలీసులు ఐడీ కార్డు చూపాలని, తన
మొబైల్ లో ఏ యాప్ ఎందుకు ఇన్ స్టాల్ చేస్తున్నారో చెప్పాలని కోరారు.
దీంతో
విధి నిర్వహణలో ఉన్న పోలీసులు సదరు సైనికుడి పట్ల దురుసగా ప్రవర్తించారు. అతడిని
బలవంతంగా వాహనంలో ఎక్కించేందుకు ప్రయత్నించారు.
ఈ ఘటన పట్ల స్థానికులు కూడా ఆగ్రహం
వ్యక్తం చేసి సదరు పోలీసుల తీరును తప్పుబట్టారు. ఈ విషయమై బాధితుడు జిల్లా ఎస్పీకి
ఫిర్యాదు చేశారు. విధినిర్వహణలో దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుళ్లు
ముత్యాలనాయుడు, దేవుళ్లు, రమేష్, శోభలను తక్షణమే సస్పెండ్ చేయాల్సిందిగా
రేంజ్ డీఐజీ, జిల్లా ఎస్పీలకు, డీజీపీ రాజేంద్రనాథ్
రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసు సిబ్బంది వారిపైనే
దాడికి దిగడం క్షమించరాని నేరమన్నారు.