పార్లమెంటులో ప్రశ్నకు లంచం (cash-for-query) ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(TMC) ఎంపీ మహువా మొయిత్రా( Mahua Moitra) ని విచారించిన లోకసభ నైతిక విలువల కమిటీ ఇవాళ మరోసారి భేటీ కానుంది. మహువా పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాలంటూ తయారు చేసిన ముసాయిదాను కమిటీ సభ్యులు నేడు ఆమోదించే అవకాశముంది.
ఆమెపై చర్యలు కోరుతూ స్పీకరుకు సిఫార్సు చేయనున్నట్లు సమాచారం.
మహువా ఎంపీ సభ్యత్వం రద్దు చేయడంతో పాటు నైతిక విలువల కమిటీ నుంచి బహుజన సమాజ్ వాదీ పార్టీ(BSP) ఎంపీ డానిష్ అలీని తప్పించాలని కూడా స్పీకర్ ను కోరనున్నారు.
నవంబర్ 2న లోక్ సభ నైతిక విలువల కమిటీ ముందు విచారణకు హాజరైన మహువా, తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చారు. అయితే తనను అభ్యంతరకరమైన ప్రశ్నలు అడిగారంటూ విచారణ నుంచి అర్ధాంతరంగా బయటకు వచ్చారు. ఆమెతో పాటు విపక్ష పార్టీలకు చెందిన కమిటీ సభ్యులు కూడా విచారణను బహిష్కరించారు.
విచారణ కమిటీ నుంచి అర్ధాంతరంగా బయటకు వచ్చిన వారిలో బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ, జనతాదళ్ యునైటెడ్ కు చెందిన గిరిధర్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు.
మహువాపై సీబీఐ విచారణకు లోక్ పాల్ ఆదేశించిందని ఈ కేసులో ప్రధాన ఫిర్యాదుదారుడిగా ఉన్న బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. జాతి భద్రతను పణంగా పెట్టి లోకసభలో ప్రశ్నలకు లంచం తీసుకున్నారని ఆరోపించారు. ఈ పోస్టుపై స్పందించిన మహూవా మొదట అదానీ గ్రూపుపై విచారణ చేపట్టాలన్నారు.