పైబర్‌నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్‌పై విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం (supreme court) ప్రకటించింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. సీఐడీ తనపై నమోదు చేసిన ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకు ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని కూడా న్యాయమూర్తులు ఆదేశించారు.
స్కిల్ కేసులో తీర్పు రిజర్వులో ఉన్నందున ఆ తీర్పు వచ్చిన తరవాత, ఫైబర్‌నెట్ కేసు విచారణ చేపడతామని సుప్రీకోర్టు ధర్మాసనం వెల్లడించింది. ఫైబర్‌నెట్ కేసును తొలుత ఈ నెల 23కు వాయిదా వేయాలని ధర్మాసనం నిర్ణయించింది. చంద్రబాబు తరపు న్యాయవాది సిద్దార్ద లూధ్రా, ఈ నెల 30వ తేదీకి వాయిదా వేయాలని కోరడంతో అందుకు న్యాయమూర్తులు అంగీకరించారు. స్కిల్ కేసులో (skill scam) 30వ తేదీ తీర్పు రానుంది. ఆ తీర్పు వచ్చిన తరవాతే ఫైబర్‌నెట్ కేసు విచారించనున్నారు.