వన్డే క్రికెట్ వరల్డ్ కప్ (CWC)-2023 టోర్నీలో బాగంగా నెదర్లాండ్స్ పై ఇంగ్లండ్( Netherlands vs England) జట్టు ఘనవిజయం సాధించింది. పుణె వేదికగా బుధవారం జరిగిన పోరులో డచ్ జట్టును ఆంగ్లేయులు 160 పరుగుల తేడాతో ఓడించారు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది.
బెన్‌స్టోక్స్ (108) సెంచరీతో, మలాన్(87), క్రిస్ వోక్స్(51), అర్ధసెంచరీలతో రాణించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డీ లీడే 3 వికెట్లు తీసి 74 పరుగులు ఇచ్చాడు. ఆర్యన్ దత్, వాన్ బీక్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
లక్ష్యఛేదనలో నెదర్లాండ్స్ విఫలమైంది.
37.2 ఓవర్లకు 179 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. తేజ(41*), ఎడ్వర్డ్స్(38) టాప్ స్కోరర్లుగా ఉన్నారు. అలీ, రషీద్ చెరో మూడు వికెట్లు తీశారు. విల్లే రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు.
ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించిన బెన్ స్టోక్స్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇంగ్లండ్ తన ఆఖరి మ్యాచ్ లో ఈ నెల 11న పాకిస్తాన్ తో ఆడనుండగా, 12న నెదర్లాండ్స్, భారత్ తలపడనున్నాయి.
తాజా గెలుపుతో ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుంచి ఏడోస్థానానికి ఎగబాకింది. ఈ విజయంతో వరల్డ్‌కప్ టోర్నీలో బ్రిటీషు జట్టుకు ఒరిగేది ఏమీ లేనప్పటికీ ఛాంపియన్స్ ట్రోపీ 2025కు అర్హత సాధించినట్లు అయింది. వరల్డ్ కప్ లీగ్ దశ తర్వాత టాప్ -7లో ఉన్న జట్లు ఛాంపియన్స్ ట్రోఫీకి నేరుగా అర్హత సాధిస్తాయి.