తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సీఐ ఇఫ్తేకార్ అహ్మద్ హత్య కేసులో (murder case) నిందితులైన కానిస్టేబుల్ దంపతులను పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. మహబూబ్‌నగర్ మొదటి పట్టణ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ జగదీశ్, జిల్లా ఎస్పీ కార్యాలయం గ్రీవెన్స్‌సెల్‌లో పనిచేస్తోన్న శకుంతల భార్యాభర్తలు. 2009 బ్యాచ్‌కు చెందిన వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2018లో ఎస్పీ కార్యాలయంలో డీసీఆర్బీ సీఐగా ఇఫ్తేకార్ అహ్మద్ నియమితులయ్యారు. అక్కడే పనిచేస్తోన్న శకుంతలతో పరిచయం ఏర్పడింది. తరవాత కొద్ది నెలలకు ఇఫ్తేకార్ అహ్మద్ బదిలీపై వెళ్లిపోయారు. సీఐ అహ్మద్ ఇటీవల మరలా మహబూబ్‌నగర్‌కు బదిలీ అయ్యారు. అప్పటి నుంచి శకుంతల ఫోన్‌కు సందేశాలు పంపుతున్నాడు. ప్రవర్తన మార్చుకోవాలని కానిస్టేబుల్ దంపతులు చెప్పినా అహ్మద్ పట్టించుకోలేదు.
ఈ నెల ఒకటవ తేదీ రాత్రి 12 గంటలకు శకుంతల ఇంటికి సీఐ అహ్మద్ రావడంతో కానిస్టేబుల్ దంపతులు, వారి బంధువు కృష్ణ దాడి చేశారు. మర్మాంగాలు కోసివేసి, తలపై బలంగా కొట్టడంతో సీఐ కోమాలోకి వెళ్లిపోయాడు. అతన్ని కారు డిక్కీలో వేసి దూరంగా మర్ల-పాలకొండ రహదారి పక్కన కారుతో సహా వదిలేశారు. ఉదయాన్నే స్థానికులు చూసి, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ అహ్మద్‌ను స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ సీఐ అహ్మద్ గత మంగళవారం చనిపోయాడు. నిందితులు పరారు కావడంతో ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా జగదీశ్ దంపతులను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. మరో నిందితుడు కృష్ణ పరారీలో ఉన్నాడని పోలీసు అధికారులు వెల్లడించారు.