వన్డే వరల్డ్ కప్(CWC-2023)లో అత్యంత పేలవ
ప్రదర్శనతో
ఇప్పటికే సెమీస్ రేసు
నుంచి
తప్పుకున్న ఇంగ్లండ్..
పరువు నిలుపుకునేందుకు గాను నేడు నెదర్లాండ్స్‌తో మ్యాచ్ లో భారీ స్కోరు నమోదు
చేసింది. 50 ఓవర్లకు 9 వికెట్లు నష్టపోయి 339 పరుగులు చేసింది.
మహారాష్ట్రలోని పూణె వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మొదట టాస్
గెలిచిన ఇంగ్లండ్.. బ్యాటింగ్ ఎంచుకుని డచ్ జట్టు ముందు 340 లక్ష్యాన్ని ఉంచింది.
ఈ టోర్నీలో
వరుసగా విఫలమవుతున్న ఇంగ్లీష్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో (15) మరోసారి నిరాశపరిచాడు. మరో ఓపెనర్ డేవిడ్ మలన్ మాత్రం ధాటిగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు.
ఆర్యన్ దత్ వేసిన ఏడో ఓవర్లోనే బెయిర్ స్టో.. వాన్ మీకెరెన్‌కు
క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 48 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది.
మలన్ మాత్రం నెదర్లాండ్స్
బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. 36 బంతుల్లోనే అర్ధ శతకం కొట్టాడు. 19 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్..
ఒక వికెట్ నష్టానికి 128 పరుగులు
చేసింది. 20.2 బంతికి జో రూట్ (28) బౌల్డ్ అయ్యాడు. 21.6 వ
బంతికి డేవిడ్
మలన్ 87 పరుగుల వద్ద రన్ ఔట్ అయ్యాడు. 74 బంతులు ఆడిన మలన్, పది ఫోర్లు, రెండు
సిక్సులు బాదాడు.
హ్యారీ బ్రూక్ (11) బాస్ డీ
లీడే బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ గా పెవిలియన్ చేరాడు. దీంతో 164 పరుగుల వద్ద ఇంగ్లండ్
నాలుగు వికెట్లు కోల్పోయింది.
29 ఓవర్లకు బ్రిటీషు జట్టు 174 పరుగులు చేసింది. 30.1
బంతికి జోష్ బట్లర్ కూడా పెవిలియన్ చేరాడు. పాల్ వాన్ మీకెరెన్ బౌలింగ్ లో తేజ నిడమానూరుకు క్యాచ్ అందించాడు.
31 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లు నష్టపోయి 180 పరుగులు చేసింది.
ఆర్యన్ దత్ వేసిన 35.2 బంతికి
మొయిన్ అలీ (4) వెనుదిరిగాడు. 36 ఓవర్లు ముగిసే సరికి 194 పరుగులు చేశారు. 47.5 బంతికి బెన్ స్టోక్స్ సెంచరీ పూర్తి
చేశాడు.
అర్ధ సెంచరీ చేసిన అనంతరం క్రిస్ వోక్స్ ఔట్ అయ్యాడు. 45
బంతుల్లో 51 పరుగులు చేసి బాస్ డీ లీడే వేసిన 48.4 బంతికి క్యాచ్ ఔట్ గా
వెనుదిరిగాడు. 48.6 బంతికి డివిడ్ విల్లే కూడా నిష్ర్కమించాడు.
వాన్ బీక్ వేసిన 49.4
బెన్ స్టోక్స్ కూడా 108 పరుగుల వద్ద ఔటయ్యాడు. బ్రిటీషు జట్టు నిర్ణీత
50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 339 పరుగులు చేసింది.
ఆర్యన్ దత్ 2, బాస్ డీ లీడే 3,
వాన్ బీక్2, పాల్ మీకెరెన్ ఒక వికెట్
తీశారు. ఇంగ్లండ్
ఈ మ్యాచ్‌లో గెలవకపోతే 2025లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో
చోటు కోల్పోనుంది.