జనాభా నియంత్రణపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (bihar cm nitish kumar) చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఘాటుగా స్పందించారు. నితీశ్ కుమార్ పేరు ఎత్తకుండానే ఇండియాకూటమిపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాల అహంకార కూటమి ఇండియాలో పెద్దనేత… నిన్న బిహార్ అసెంబ్లీలో మహిళలకు కించపరుస్తూ మాట్లాడటానికి, వారికి సిగ్గుగా అనిపించడం లేదా? అంటూ మోడీ ప్రశ్నించారు. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గుణలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బిహార్ సీఎం వ్యాఖ్యలను ఇండియా కూటమిలోని ఒక్క నేత కూడా స్పందించలేదని మోదీ తప్పుపట్టారు. ఇలాంటి ఆలోచనలు కలిగిన కూటమి నాయకులు ప్రజలకు మంచి చేయగలరా? అంటూ ప్రధాని ప్రశ్నించారు. మహిళలను అగౌరవపరుస్తూ అవమానిస్తున్నారంటూ మోదీ విమర్శించారు.
బిహార్లో ఇటీవల నిర్వహించిన కులగణన నివేదికను మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం నీతీశ్ కుమార్ మాట్లాడుతూ…చదువుకున్న మహిళలను భర్తను నియంత్రించగలరంటూ వ్యాఖ్యానించారు. భర్తల చర్యల వల్ల జనాభా పెరిగిందన్నారు. ఆయన వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఆ తరవాత నితీశ్ కుమార్ క్షమాపణలు చెప్పారు. నా మాటలు ఇబ్బందికి గురిచేసిఉంటే వాటిని ఉపసంహరించుకుంటున్నానని ప్రకటించారు.