సోషల్
మీడియాలో అనుచిత పోస్టుల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సీఐడీ చీఫ్
సంజయ్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి ఇతరులను కించపరిచేలా పోస్టులు పెడితే చర్యలు
తప్పవని హెచ్చరించారు. ఫేక్ అకౌంట్స్ నడిపే వారిని కూడా పట్టుకుని కఠిన చర్యలు
తీసుకుంటామని పేర్కొన్నారు.
సీఎం,
మహిళా మంత్రులపై ఇటీవల కాలంలో అసభ్యకరంగా పోస్టులు పెట్టేవారిని గుర్తించినట్లు
చెప్పిన సీఐడీ చీఫ్, అనుచిత పోస్టింగ్ లు చేసిన వారిపై కచ్చితంగా
చర్యలుంటాయన్నారు. ప్రతిపక్ష నేతలపైనా సోషల్
మీడియాలో పెడుతున్న పోస్టులను పరిశీలిస్తున్నామన్నారు. సోషల్ మీడియాను
దుర్వినియోగం చేయడం సరికాదన్నారు.
అభ్యంతరకరమైన
రాతలతో కూడిన పోస్టింగులను గుర్తించి తొలగించామన్నారు.
గత ఏడాది 1,450, ఈ ఏడాది 2,164
పోస్టులను తొలగించినట్లు వివరించారు. న్యాయవ్యవస్థపై తప్పుడు ప్రచారాలు చేసే వారి
మీద కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఆస్తులు కూడా సీజ్ చేస్తామన్నారు.
ప్రతిపక్షాలపై
అసభ్యకర పోస్టులపై కూడా కఠినంగా వ్యవహరిస్తామని తెలిపిన సీఐడీ బాస్ .. 45 తప్పుడు పోస్టులను గుర్తించామన్నారు.
ఇతర
దేశాలలో ఉండి అశ్లీల, అసభ్యకర పోస్టులు పెట్టేవారిని కూడా వదిలిపెట్టబోమన్నారు. ఆయా దేశాల
ఎంబసీతో సంప్రదింపులకు సీఐడీ ప్రత్యేక బృందాలు పంపించామని
వెల్లడించారు. ఇప్పటికే 45 కేసుల్లో ఐదుగురిపై ఎల్వోసీ ప్రోసీడింగ్స్ చేపట్టినట్లు
వివరించారు.
హైకోర్టు
న్యాయమూర్తిపై అనుచిత పోస్టింగ్లు చేసిన 19 మందికి నోటీసులు ఇచ్చామన్నారు. సోషల్
మీడియాలో అసభ్యకర మెసేజ్లు పెట్టే 2,972 మందిపై సైబర్ బుల్లీయింగ్ షీట్స్ ఓపెన్
చేశామన్నారు.