Ayodhya gearing up for Deepotsav on Deepavali
రామజన్మభూమి అయోధ్య దీపావళి
దీపోత్సవానికి సిద్ధమవుతోంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో రాముడి బ్యానర్లు,
పోస్టర్లు వెలిసాయి.
దీపావళికి ముందు నిర్వహించే దీపోత్సవంలో
ఈ సంవత్సరం 21లక్షల దీపాలు వెలిగిస్తారు. ఆ సందర్భంగా ‘రామలీల’ లేజర్ షో ఏర్పాటు
చేస్తున్నారు. బాణాసంచా కూడా ఘనంగా కాలుస్తారు. ఆ కార్యక్రమాలకు సంబంధించి
ఏర్పాట్లు ఘనంగా మొదలయ్యాయి, నగరంలోని ప్రధాన ప్రదేశాల్లో పెద్దపెద్ద పోస్టర్లు,
బ్యానర్లు ఏర్పాటు చేసారు. దీపోత్సవానికి సంబంధించిన పనులు సజావుగా సాగుతున్నాయి.
శ్రీరామచంద్రుడి జీవిత ఘట్టాలు,
రామచరిత మానస్‌లో వర్ణించిన దృశ్యాలను బ్యానర్లపై చిత్రీకరించారు. అయోధ్యా నగరం,
సుందరకాండలోని ఘట్టాలు కూడా బ్యానర్లపై కనువిందు చేస్తున్నాయి.
వాటితోపాటు, రహదారుల వెంబడి అండర్‌గ్రౌండ్
లైటింగ్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇక, రహదారులపై కరెంటు వైర్లు అడ్డదిడ్డంగా వేలాడుతుండే
దృశ్యాలు అయోధ్యలో కనిపించబోవు.
‘‘ఈ సంవత్సరం దీపోత్సవం
ప్రత్యేకమైనది. మరికొన్నాళ్ళలోనే రామ్‌లల్లా తన మందిరంలో విరాజమానుడవుతారు. అది
కేవలం మాకే కాదు, మొత్తం దేశానికే గర్వకారణమైన సందర్భం. అందుకే ఈ దీపోత్సవం కోసం
నగర ప్రజలంతా వేయికళ్ళతో ఎదురు చూస్తున్నారు’’ అని అయోధ్య పౌరుడు ఒకరు చెప్పారు.
వచ్చే
యేడాది జనవరి 22న అయోధ్యలో నిర్మించిన భవ్య రామమందిరంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట
జరుగుతుంది. దానికి ముందు జరగబోయే దీపోత్సవం కోసం అయోధ్య వాసులు ఆనందోత్సాహాలతో
ఎదురుచూస్తున్నారు.
శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్, ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ నేతృత్వంలో
భవ్యమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ప్రధానమంత్రిని ఇప్పటికే
ఆహ్వానించారు. ఆ కార్యక్రమంలో ప్రధాని
మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్సంఘచాలక్
మోహన్ భాగవత్ పాల్గొంటారు.