అయోధ్య రామమందిరంలో జనవరి 22న బాలరాముడి విగ్రహ
ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలందరినీ భాగస్వాములు చేసే ఉద్దేశంతో
శ్రీరామతీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాణ ప్రతిష్ట రోజున
దేశంలోని భక్తులకు రఘురాముడి అక్షతలు అందజేయనుంది.
అయోధ్య నుంచి దేశం నలుమూలలకు
ఇప్పటికే అక్షతలు చేరవేశారు. దిల్లీ నుంచి వచ్చిన రైలు లో విజయవాడకు అక్షతలు పంపగా
విజయవాడలోని హిందూ సంఘాల సభ్యులు వాటిని స్వీకరించి ఊరేగింపు నిర్వహించారు.
అయోధ్య దివ్య మందిర ప్రాణప్రతిష్ఠ సమయంలో
(జనవరి 22) ప్రజలందరికీ అందించడానికి శ్రీరామతీర్ధ
క్షేత్ర ట్రస్ట్ పంపిన శ్రీరాముని పూజిత అక్షతల కలశం విజయవాడకు చేరిన సందర్భంగా రైల్వేస్టేషన్ లో శ్రీశ్రీశ్రీ
కమలానంద భారతీ స్వామి వారు స్వీకరించారు. అక్కడ నుంచి పూర్ణానందంపేట వరకు ఊరేగింపు
నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వీహెచ్పీ ఉత్తరాంధ్ర ప్రాంత కోశాధ్యక్షుడు దుర్గాప్రసాద్ రాజు, ప్రాంత జన సంపర్క అభియాన్ ప్రముఖ్ నరసయ్య, ఆంధ్రప్రదేశ్ సంఘటనా మంత్రి శ్రీనివాస రెడ్డి, వీహెచ్పీ కార్యాలయ
ప్రముఖ్ యతిరాజాచార్యులు, ప్రాంత సహ కార్యదర్శి సుబ్బరాజు , ప్రాంత భజరంగ్ దళ్ బలోపాసన ప్రముఖ్ రాజశేఖర్, విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహనగర్ ఉపాధ్యక్షుడు రాఘవరాజు సహా పలువురు ప్రముఖులు,
హిందూ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
అక్షతల కలశాన్ని పూర్ణానందంపేటలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి
ఆలయంలో భద్రపరిచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 15 వరకు ప్రతీ రోజు సాయంత్రం 6గంటల నుంచి 6గంటల30నిమిషాల
వరకు అక్షతలకు విజయ మహామంత్రం, హనుమాన్ చాలీసా పారాయణతో పూజలు జరుగుతాయి. ఈ
కార్యక్రమంలో భక్తులంతా పాల్గొనాలని విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ కోరాయి.