అయోధ్య రామమందిర(Ayodhya
temple
) ప్రారంభోత్సవంలో ఆర్ఎస్ఎస్, భారతజాతి గర్వించే పాత్ర పోషించిందని సంఘం
ప్రధాన కార్యదర్శి దత్రాత్రేయ హోసబలే(RSS general secretary
Dattatreya Hosabale)
అన్నారు.
వచ్చే ఏడాది జనవరి 22న జరిగే మందిర ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీతో
పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను రామమందిర నిర్మాణ ట్రస్ట్ ఆహ్వానించింది. ఈ
చారిత్రాత్మక కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనసమీకరణలో భాగంగా రాష్ట్రీయ స్వయం
సేవక్ సంఘ్ కార్యకర్తలు కూడా ఇంటింటి ప్రచారం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
భవ్య
రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా రెండు వారాల పాటు ధార్మిక,
సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ట్రస్ట్ ప్రకటించింది. అలాగే జనవరి 14
నుంచి వారంపాటు ప్రత్యేక క్రతువు నిర్వహించనుంది. అయితే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం
రోజు లక్షలాది మంది స్వయం సేవకులు అయోధ్యకు చేరుకునే వీలు లేకపోవడంతో వారంతా
రాముడి ఫోటోలతో పాటు అక్షతలను దేశం వ్యాప్తంగా భక్తులకు అందజేస్తారని దత్తాత్రేయ
హోసబలే వివరించారు.
గుజరాత్
లోని కఛ్ జిల్లా భుజ్ లో సంఘ్ కార్యనిర్వాహక సభ్యుల మూడు రోజుల సమావేశాల ముగింపు
సందర్భంగా ఆయన ఈ విషయాలు వెల్లడించారు. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ప్రతీ గడపకూ వెళ్లి రామమందిర ప్రారంభోత్సవ
కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆహ్వానిస్తారని పునరుద్ఘాటించారు.
సరిహద్దు
గ్రామాల్లో స్వయం సేవకులు పర్యటించి స్థానికుల సమస్యలు తెలుసుకోవాలని సంఘం
నిర్ణయించినట్లు తెలిపారు. సదుపాయాల లేమి, దాడుల కారణంగా వలసలు జరుతున్నాయని ఆవేదన
చెందారు. దేశాన్ని రక్షించుకునే బాధ్యత సైనికులతో పాటు ప్రజలపై కూడా ఉందన్నారు.
భారత్
ఎప్పటి నుంచో హిందూ రాజ్యంగా ఉన్నందున
కొత్తగా పనిగట్టుకుని హిందూదేశంగా మార్చాల్సిన
అవసరం లేదన్నారు. దేశం ఎప్పటి నుంచో ఒకటిగా ఉందన్నారు. దేశాన్ని దక్షిణ,
ఉత్తర భాగాలుగా విడగొట్టే కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని ఇదే ప్రస్తుతం దేశం
ముందున్న అతిపెద్ద సవాల్ అన్నారు.
ఉత్తర
భారతం, దక్షిణ భారతం పేరిట వైషమ్యాలు రేపడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రజలంతా దీనిని
ఐక్యంగా వ్యతిరేకించాలని కోరిన దత్తాత్రేయ హోసబలే, దేశాన్ని విడగొట్టాలనుకునే వారు
ఎప్పటికీ విజయం సాధించలేరన్నారు.
లవ్
జిహాద్ అంశంలో రెండు పార్శ్వాలు ఉన్నాయన్న దత్తాత్రేయ, బాధితులకు పునరావాసం
కల్పించడంతో పాటు ఈ అంశంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి న్యాయపోరాటాలు చేయాల్సి
ఉందన్నారు.