Over 70 pc polling in Chattisgarh
first phase and Mizoram elections
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా మొట్టమొదట
నవంబర్ 7న మిజోరంలోని 40 శాసనసభ స్థానాలకు, ఛత్తీస్గఢ్లో నక్సల్ ప్రభావిత
ప్రాంతాల్లోని 20 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ 70శాతానికి
పైగా పోలింగ్ నమోదయింది.
ఛత్తీస్గఢ్లో మొత్తం 90
నియోజకవర్గాలున్నాయి. మొదటి దశలో 20 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఆ నియోజకవర్గాల్లో
71.8శాతం పోలింగ్ నమోదయినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. గత ఎన్నికలతో
పోలిస్తే ఇది 6శాతం తక్కువ. 2018లో జరిగిన ఎన్నికల్లో ఛత్తీస్గఢ్లో 77శాతం
పోలింగ్ నమోదయింది. ఇక్కడ పది నియోజకవర్గాల్లో ఉదయం 7గంటలకు, మిగతా పది
నియోజకవర్గాల్లో ఉదయం 8 గంటలకూ పోలింగ్ ప్రారంభమైంది.
ఛత్తీస్గఢ్లో మొదటి దఫా ఎన్నికల్లో
బీజేపీ తరఫున పోటీ చేసినవారిలో మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, భావనా బోహ్రా, లతా
ఉసేండీ, గౌతమ్ ఊకే ముఖ్యులు. కాంగ్రెస్ నేతల్లో మహమ్మద్ అక్బర్, సావిత్రీ మనోజ్
మాండవి, మోహన్ మర్కమ్, విక్రమ్ మాండవి, కవాసీ లఖ్మా ప్రధాన పోటీదారులు. ఎన్నికలు
జరిగిన 20 స్థానాల్లో కనీసం 14 సీట్లలో బీజేపీ గెలుస్తుందని మాజీ ముఖ్యమంత్రి రమణ్
సింగ్ ధీమా వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ పనితీరుపై కాంగ్రెస్ ఆశలు
పెట్టుకుని ఉంది.
మిజోరం శాసనసభలోని మొత్తం 40 స్థానాలకూ
మంగళవారం ఒకే విడతలో పోలింగ్ జరిగింది. అక్కడ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల
వరకూ పోలింగ్ నిర్వహించారు. మిజోరంలో 77.8శాతం పోలింగ్ జరిగింది. గత ఎన్నికలతో పోలిస్తే
ఇక్కడ కూడా 3శాతం పోలింగ్ తగ్గింది. గత ఎన్నికల్లో 81.5శాతం నమోదయింది. మిజోరంలో
అధికారంలో ఉన్న మిజో నేషనల్ ఫ్రంట్, బీజేపీ కూటమి గెలుపుపై ధీమాగా ఉంది. కానీ
ఈసారి మిజోరంలో బహుళపాక్షిక పోటీ బలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ
పార్టీతో పాటు కొత్తగా ఏర్పడిన జోరం పీపుల్స్ మూవ్మెంట్ కూడా ఎన్నికల్లో పోటీ చేయడంతో
మిజోరం ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.
ఈ ఎన్నికల కౌంటింగ్ డిసెంబర్ 3న జరుగుతుంది.