పేదల వ్యతిరేక ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దామని హైదరాబాద్లో జరిగిన ప్రచార సభలో ప్రధాని మోదీ (pm modi)పిలుపునిచ్చారు. కుటుంబ పాలన నుంచి, అవినీతి పరుల నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తామని చెప్పారు. అవినీతికి పాల్పడిన వారు ఎంతటి వారైనా వదిలేదే లేదన్నారు. సీఎం కేసీఆర్ సర్కార్ కూలిపోవడం ఖాయమని మోదీ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన బీసీల ఆత్మగౌరవ ప్రచార సభలో మోదీ పాల్గొన్నారు.
సమ్మక్క, సారలమ్మ, యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామికి జై అంటూ ప్రధాని ప్రసంగం ప్రారంభించారు. నా కుటుంబ సభ్యులారా అంటూ తెలుగులో ప్రచారం మొదలు పెట్టారు. తెలంగాణలో బీజేపీని గెలిపిస్తే బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.
తెలంగాణ (telangana elections) ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ప్రజలు బీజేపీపై పూర్తి విశ్వాసంగా ఉన్నారని ప్రధాని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నాణేనికి బొమ్మాబొరుసులాంటివని వ్యాఖ్యానించారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ నేతలకు సంబంధాలున్నాయని, అవినీతిలో ఎంతటి వారున్నా వదిలేదే లేదన్నారు. దేశంలో పేదలందరికీ మరో ఐదేళ్ల పాటు ఉచితంగా రేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణకు వస్తే తన కుటుంబ సభ్యుల వద్దకు వచ్చినట్లే ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. 2013లో ఎల్బీస్టేడియంలో అప్పటి ఎన్నికల ప్రచారానికి పునాది పడిందని, తరవాత తాను ప్రధాని అయినట్లు ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రిని చేయడానికి కూడా ఇక్కడే నాంది పలకాలని మోదీ పిలుపునిచ్చారు.
నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణను బీఆర్ఎస్ మోసం చేసిందని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. బీఆర్ఎస్ అవినీతి పునాదులపై నడుస్తోందని, కేసీఆర్, తన కుమారుడు కేటీఆర్, కుమార్తె కవితలను ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. తొమ్మిదేళ్ల పాలనలో బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు అన్యాయానికి గురయ్యారని చెప్పారు. బీసీలకు లక్ష ఇస్తామని కేసీఆర్ మోసం చేశాడన్నారు. రైతు రుణమాఫీ చేయలేదు, డబుల్ బ్రెడ్ రూం ఇళ్లు కొందరికే పరిమితం చేసినట్లు గుర్తుచేశారు.
హైదరాబాద్లో జరిగిన బీసీ ఆత్మగౌరవ సభలో పలువురు బీజేపీ ప్రముఖులతోపాటు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ముఖ్యనాయకులు బండి సంజయ్, ఈటల రాజేందర్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.