ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో వరుస ఓటముల తరవాత శ్రీలంక క్రికెట్ బోర్డు(srilanka cricket board)ను రద్దు చేస్తున్నట్లు ఆ దేశ క్రీడల మంత్రి రోషన్ రణసింఘె ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మంత్రి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బోర్డు అధ్యక్షుడు షమ్మి సిల్వా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన కోర్టు మంత్రి నిర్ణయాన్ని కొట్టివేసింది. దీంతో క్రికెట్ బోర్డును పునరుద్దరించినట్లైంది.
సిల్వా పిటిషన్పై పూర్తి స్థాయి విచారణను పెండింగ్లో ఉంచారు.విచారణ జరిపే వరకు బోర్డును రెండు వారాలు పునరుద్ధరించినట్లు కోర్టు అధికారులు తెలిపారు. దీంతో మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ నేతృత్వంలో కొత్త కమిటీ విధులను చేపట్టకుండా ఆపినట్లైంది.
శ్రీలంక బోర్డుపై గత కొంత కాలంగా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. క్రీడల మంత్రి రణసింఘె బోర్డు తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బోర్డును రద్దు చేసి బాధ్యతలు రణతుంగాకు అప్పగించారు. దేశంలోనే అత్యంత అవినీతి మయంగా మారిన శ్రీలంక క్రికెట్ బోర్డును మార్చాలనుకుంటున్నానని సోమవారంనాడు రణతుంగా వ్యాఖ్యానించారు.