ఇరాన్‌లో జైలు శిక్ష అనుభవిస్తోన్న నోబెల్ శాంతి బహుమతి (noble peace prize) గ్రహీత నార్గిస్ మొహమ్మది నిరాహార దీక్షకు దిగారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న తనను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు, జైలు సిబ్బంది నిరాకరించడంతో ఆమె అక్కడే నిరాహార దీక్షకు దిగారు.
ఇరాన్ హిజాబ్ సంప్రదాయాలకు వ్యతిరేక ఉద్యమంలో నార్గిస్ క్రియాశీలకంగా వ్యవహరించారు. మహిళల హక్కుల కోసం గళమెత్తారు. న్యాయపోరాటానికి దిగిన నార్గిస్‌ను ఇరాన్ పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఆమె ఆరోగ్య క్షీణించింది. గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో నార్గిస్ బాధపడుతోంది.వైద్యం కోసం ఆసుపత్రికి తరలించాలని ఆమె కోరినా అధికారులు తిరస్కరించారు. దీంతో ఆమె జైల్లోనే నిరాహార దీక్షకు దిగారు. హిజాబ్ ధరిస్తేనే ఆసుపత్రికి తీసుకెళతామని అధికారులు తేల్చి చెప్పారు. అందుకు నార్గిస్ నిరాకరించారు.
దీనిపై నార్వే నోబెల్ కమిటీ స్పందించింది. ఆస్పత్రిలో చేరాలంటే మహిళా ఖైదీలు తప్పనిసరిగా హిజాబ్ ధరించాలనే నిబంధన అమానవీయమని పేర్కొంది. ఈ చర్య అనైతికమని…ఆమెకు తక్షణమే వైద్య సాయం అందించాలని నోబెల్ కమిటీ కోరింది.
ఇరాన్‌లో మహిళా హక్కుల కోసం పోరాటం చేస్తోన్న నార్గిస్‌ను ఇప్పటి వరకు 13 సార్లు అరెస్ట్ చేశారు. ఐదుసార్లు జైలు శిక్ష విధించారు. 154 కొరడా దెబ్బలు తిన్నారు. రాజకీయ ఖైదీలు, మహిళల పట్ల జరుగుతున్న లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా నార్గిస్ జైల్లోనే ఉద్యమం చేశారు. ఆమె పోరాటానికి నోబెల్ శాంతి బహుమతి వరించింది.