రాష్ట్రంలో
కేంద్రసాయంతో అమలవుతోన్న సంక్షేమపథకాలకు జగన్ పేరు పెట్టడంపై కేంద్రప్రభుత్వం
అభ్యంతరం వ్యక్తం చేసింది. వైసీపీ
ప్రభుత్వం సొంత పేర్లు పెట్టుకుంటే అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. కేంద్ర
నిబంధనల మేరకు వ్యవహరించాలని ఆదేశించింది.
కేంద్ర
సాయాన్ని కూడా రాష్ట్రం ఖాతాలో వేస్తూ నిబంధనలకు విరుద్ధంగా పథకాలకు పేర్లు
పెట్టడం పై బీజేపీ అభ్యంతరం వ్యక్తం
చేస్తోంది. కేంద్రానికి కూడా పలు సందర్భాల్లో ఫిర్యాదులు చేసింది. తాజాగా ఈ
విషయంపై కేంద్రం ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది.
కేంద్ర సాయంతో అమలయ్యే పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారం పేర్లు
పెట్టడం సరికాదని పేర్కొంది.
కేంద్రం
నిర్దేశించిన పేరు, లోగో, ఇతర వివరాల్లో మార్పులు చేయకూడదని, వాటికి రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా పెట్టుకునే పేర్లు, ఇతర లోగోలు జత చేయకూడదని స్పష్టం
చేసింది. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ కేంద్ర పథకాలకు సంబంధించి సుమారుగా రూ. 4,000 కోట్ల సాయాన్ని తాత్కాలికంగా నిలిపేసినట్లు
సమాచారం.
రాష్ట్ర
ప్రభుత్వం జగనన్న కాలనీల పేరిట దాదాపుగా 18.64 లక్షల ఇళ్ళ నిర్మాణం చేపడుతోంది.
కేంద్రం నుంచే నిధులు ఆధారంగానే ఈ పథకం అమలవుతోంది. ఒక్కో ఇంటి నిర్మాణానికి లబ్ధిదారులకు అందే రూ.1.80
లక్షల్లో పట్టణాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాభివృద్ధి సంస్థల్లో రూ.1.80
లక్షలు కేంద్రం అందజేస్తోంది. కానీ రాష్ట్ర
ప్రభుత్వం దీనిని తన సొంత కార్యక్రమంగా ప్రచారం చేసుకోవడంపై కేంద్రం ఆగ్రహం
వ్యక్తం చేస్తోంది.
ప్రధానమంత్రి
ఆవాస్ యోజనకు వైఎస్సార్ పేరును జోడించి పీఎంఏవై- వైఎస్సార్ (అర్బన్)-బీఎల్సీ
పథకంగా రాష్ట్రప్రభుత్వం మార్చడాన్ని కూడా కేంద్రం తప్పుబట్టింది. స్థలానికి, ఇతర మౌలిక వసతులకు మేం కూడా
నిధులిస్తున్నాం కదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు సమాచారం.
దీంతో
చేసేది ఏమీ లేక వైఎస్సార్ పేరు తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో సైతం విడుదల
చేసింది. ఇప్పటికే పూర్తయిన 5
లక్షల గృహాల్లో ఏర్పాటు చేసిన బోర్డుల్ని కూడా
మారుస్తామని కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం నివేదించిందట.
మహిళా
శిశు సంక్షేమశాఖలో ఐసీడీఎస్, పోషణ
పథకాల అమలుకు కూడా కేంద్రప్రభుత్వం సహకారం అందిస్తోంది. అంగన్వాడీ కేంద్రాల్లోని
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారాన్ని
అందించేందుకు కేంద్రం రోజుకు ఒక్కొక్కరిపై రూ.4
ఖర్చు చేస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటికి వైఎస్సార్ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ పేర్లు పెట్టింది. దీనిపై
కూడా కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసి నిధులు ఆపేసినట్లు సమాచారం.
కేంద్రప్రభుత్వం
ఆధ్వర్యంలో నడిచే సంస్థల్లో కూడా ప్రధాని ఫోటో పెట్టని పరిస్థితి కొన్ని
రాష్ట్రాల్లో నెలకొంది. మన రాష్ట్రంలోని ఎయిమ్స్ లో ప్రధాని ఫొటో లేకపోవడంపై ఇటీవల
కేంద్రమంత్రి భారతీ ప్రవీణ్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గ్రామీణ ప్రాంతాల
అభివృద్ధి విషయంలో కూడా కేంద్ర నిధుల సాయం ప్రస్తావించకుండా బోర్డులు ఏర్పాటు
చేయడాన్ని ఆమె తప్పుబట్టారు.