కర్ణాటక గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రతిమ హత్య (pratima murder) కేసు మిస్టరీ వీడింది. గతంలో ఆమె వాహనానికి డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తే ఈ అరాచకానికి పాల్పడ్డాడని పోలీసుల విచారణలో తేలింది. హత్యకు పాల్పడ్డ కిరణ్‌ను సుబ్రహ్మణ్యపుర పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు వారాల కిందటి వరకు కిరణ్, ప్రతిమ వాహనానికి డ్రైవర్‌గా పనిచేశాడు. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదానికి కారకుడు కావడం, దాడుల విషయం గనుల యజమానులకు ముందే చేరవేస్తూ ఉండటంతో అతన్ని తప్పించారు.
గత శనివారం రాత్రి కొత్త డ్రైవర్ ప్రతిమను ఇంటి వద్ద దింపి వెళ్లగానే కిరణ్ ఆమె వద్దకు వచ్చాడు. మరలా పనిలోకి తీసుకోవాలని కాళ్లావేళ్లాపడినా ప్రతిమ అంగీకరించలేదని, వెంట తెచ్చుకున్న వైరును ఆమె గొంతుకు బిగించి చంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
వైరుతో ఊపిరాడకుండా చేయడమే కాకుండా, తరవాత కత్తితో పొడిచి ప్రతిమను చంపేశాడని పోలీస్ కమిషనర్ వెల్లడించారు. గనుల యజమానులు ప్రతిమను హత్య చేయించి ఉంటారని ముందుగా అనుమానించినా, మాజీ డ్రైవర్ కదలికపై పోలీసులకు అనుమానం రావడంతో, అతని కదలికలపై నిఘా ఉంచారు. ప్రతిమను హత్య చేసిన సమయంలో కిరణ్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు చేశారు. ప్రతిమను హత్య చేసిన విషయాన్ని కిరణ్ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.