Udayanidhi Stalin again on Sanatana Dharma
కుక్కతోక ఎప్పుడూ వంకరే. దాన్ని
మార్చడం ఎవరివల్లా కాదు. ఆ విషయాన్ని మరోసారి నిరూపించాడు ఉదయనిధి స్టాలిన్. సనాతన
ధర్మాన్ని నిర్మూలించాలంటూ చేసిన వ్యాఖ్యల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే
లేదంటున్నాడు. తనకంటె ముందు అంబేద్కర్, రామస్వామి నాయకర్ వంటివారు సైతం అలాంటి
వ్యాఖ్యలే చేసారంటూ తనను తాను సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
తమిళనాడు ముఖ్యమంత్రి కొడుకు, ఆ
రాష్ట్ర యువజన వ్యవహారాల మంత్రి ఉదయనిధి గత నెలలో సనాతన ధర్మాన్ని కించపరుస్తూ
చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టించాయి. జాతీయవ్యాప్తంగా ఆ అంశం విస్తృతంగా
చర్చనీయాంశమైంది. సనాతన ధర్మాన్ని డెంగీ వంటి జ్వరాలతో పోల్చి, దాన్ని పూర్తిగా
నిర్మూలించాలంటూ ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.
క్రైస్తవ మతాన్ని అనుసరించే ఉదయనిధి మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. హిందువుల మనోభావాలను
పట్టించుకోవలసిన అవసరం లేదని భావించే ఈ స్టాలిన్ కొడుకు తన వ్యాఖ్యలను మరోసారి
సమర్ధించుకున్నాడు. తను చెప్పిన దాంట్లో తప్పేమీ లేదనీ, చట్టబద్ధంగానే
ఎదుర్కొంటాననీ మరొక్కసారి వదరుబోతు ప్రేలాపనలకు పాల్పడ్డాడు.
సోమవారం చెన్నయ్‌లో మీడియాతో
మాట్లాడుతూ ‘‘నేను అన్నదాంట్లో తప్పు ఏమీలేదు. ఈ విషయాన్ని మేం చట్టబద్ధంగానే
తేల్చుకుంటాం. నేను నా వైఖరిని మార్చుకునే ప్రసక్తే లేదు. నేను నా సిద్ధాంతం
గురించి మాత్రమే మాట్లాడాను’’ అని స్పష్టం చేసాడు.
సెప్టెంబర్ 2న మద్రాస్‌లో ‘సనాతన ధర్మ
నిర్మూలన’ పేరుతో సదస్సు నిర్వహించారు. ఆ సదస్సులో ఉదయనిధి స్టాలిన్, తమిళనాడు హిందూ
ధార్మిక సంస్థల దేవదాయ శాఖ మంత్రి పి.కె శేఖర్ బాబు పాల్గొన్నారు. అక్కడే ఉదయనిధి
వివాదాస్పద వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసారు. దానిపై మద్రాసు హైకోర్టులో పిటిషన్
దాఖలైంది. అయితే పోలీసులు ఉదయనిధి, శేఖర్బాబులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దాంతో
పోలీసులు తమ విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని మద్రాసు హైకోర్టు
వ్యాఖ్యానించింది.
ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత
చెన్నై నగరానికి చెందిన మగేష్ కార్తికేయన్ అనే వ్యక్తి ‘ద్రవిడ భావజాల నిర్మూలన,
తమిళుల సంఘటన’ పేరిట సదస్సు నిర్వహించడానికి తనకు పోలీసుల అనుమతి ఇప్పించాలని
కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసాడు. ఆ పిటిషన్‌ను జస్టిస్ జి జయచంద్రన్
కొట్టివేసారు. ఆ విచారణ సందర్భంగా, ఉదయనిధి స్టాలిన్ కేసులో పోలీసులు తమ విధి
నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గమనించింది.
ఆ మొత్తం వ్యవహారంపై ఒక మీడియా
ప్రతినిధి తాజాగా సోమవారం ఉదయనిధిని మరోమారు ప్రశ్నించారు. దానికి జవాబిస్తూ
ఉదయనిధి తన నైజం అంతేనని, తన వ్యాఖ్యల నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదనీ స్పష్టం
చేసాడు. బీఆర్ అంబేద్కర్, ఈవీ రామస్వామి వంటివారు సైతం సనాతన ధర్మంపై అలాంటి
వ్యాఖ్యలే చేసారనీ ఉటంకించాడు.
ఉదయనిధి స్టాలిన్‌పై మద్రాస్
హైకోర్టులో మరో పిటిషన్ కూడా దాఖలైంది. సనాతన ధర్మం మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం
ద్వారా రాజ్యాంగాన్ని మోసం చేసాడంటూ ఉదయనిధిపై కేసు నమోదయింది. మంత్రిగా తన విధులు
నిర్వహించడంలో రాజ్యాంగాన్ని, ప్రజలను మోసం చేసాడని ‘కో వారంటో’ పిటిషన్ దాఖలైంది.
అదింకా కోర్టు విచారణలో ఉంది.