ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు (israel hamas war) మెరుపుదాడులకు నెల రోజులు పూర్తైంది. హమాస్ దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడుతోంది. ఈ యుద్ధంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్య క్షుడు ఇబ్రహీం రైసీ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. తమ శక్తి సామర్థ్యాలు మొత్తం ఉపయోగించి గాజాపై ఇజ్రాయెల్ దాడిని ఆపాలని కోరారు. గాజాలో అణగారిన ప్రజలపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు ఆపేలా అక్కడ కాల్పుల విరమణకు అన్ని దేశాలు ప్రయత్నం చేయాలని ఇరాన్ అధ్యక్షుడు ఓ ప్రకటన విడుదల చేశారు.
తక్షణం కాల్పుల విరమణ పాటించి, దిగ్భంధనాన్ని ఎత్తివేసి, గాజా ప్రజలకు సహాయం అందించడానికి ఇరాన్ మద్దతు ఇస్తుందని ఇరాన్ అధ్యక్షుడు పేర్కొన్నారు. పాలస్తీనాలో ప్రజలకు చంపడం ప్రపంచంలోని చాలా దేశాలకు ఆగ్రహం తెప్పిస్తోందని, ఇది తీవ్ర పరిణామాలకు దారితీసే ప్రమాదముందన్నారు.
గాజాలో అమాయక మహిళలు, పిల్లలను చంపడం, ఆసుపత్రులు, పాఠశాలలు, మసీదులు, చర్చిలు, నివాస ప్రాంతాలపై దాడులు ఆమోదయోగ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. పాలస్తీనాపై ప్రజల పోరాటానికి అన్ని దేశాలు మద్దతు ఇవ్వాలని రైసీ కోరారు.