ఛత్తీస్‌గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (five states elections) ప్రారంభమైంది. తొలి విడతలో ఛత్తీస్‌గఢ్‌లో 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని 7 జిల్లాల్లో పోలింగ్ జరుగుతోంది. మావోయిస్టుల ప్రభావం ఉండటంతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్, జగదల్పూర్, చిత్రకోట్‌లో సాయంత్రం 5 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ నిలిపివేయనున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలుండగా ఇవాళ 20 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ నెల 17న మిగిలిన 17 స్థానాలకు పోలింగ్ జరపనున్నారు. ఈశాన్య రాష్ట్రం మిజోరంలోని 40 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. 40 స్థానాలకు 174 మంది బరిలో నిలిచారు.
ఓటు వేయకుండానే వెనుతిరిగిన మాజీ సీఎం
మిజోరం మాజీ సీఎం, మిజో నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడు జోరంతంగా, ఐజ్వాల్ నార్త్ 2 నియోజకవర్గంలోని 19 ఐజ్వాల్ వెంగ్లాయ్ 1 పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. అయితే ఈవీఎం పనిచేయకపోవడంతో ఓటు వేయకుండానే వెనుతిరిగారు. కొంత సమయం వేచి చూసినా ఈవీఎం పనిచేయలేదు. మిషన్ పనిచేయకపోవడంతో తొలి గంటలో ఓటు వేయలేకపోయానని మాజీ సీఎం జోరంధంగా చెప్పారు.
ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు కలకలం
ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ పోలింగ్ జరుగుతున్న సమయంలో పేలుడు కలకలం రేపింది.
సుక్మా జిల్లాలో ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో సీఆర్పీఎఫ్ జవాను గాయపడ్డారు. తోండమర్కాలో ఈ ఉదయం మావోయిస్టులు ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారని సుక్మా ఎస్పీ తెలిపారు.