Sabyasachi’s Heritage Bridal Collection
faces backlash
భారతదేశపు గొప్ప డిజైనర్స్‌లో
ఒకడిగా పేరుపొందిన సబ్యసాచి ముఖర్జీ తాజా దుస్తుల శ్రేణి కోసం రూపొందించిన ప్రకటన
తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. పండుగలు, పెళ్ళిళ్ళ సీజన్ కోసం కొత్తగా హెరిటేజ్
బ్రైడల్ కలెక్షన్ దుస్తుల శ్రేణి వస్తోంది. దాని కోసం రూపొందించిన ప్రకటనలో ఒక్క మోడల్ కూడా బొట్టు
పెట్టుకోకపోవడంపై నెటిజెన్లు మండిపడుతున్నారు.
దీపావళి పండుగ, ఆ తర్వాత
కార్తీకమాసం, పెళ్ళిళ్ళ సీజన్‌ని దృష్టిలో పెట్టుకుని సబ్యసాచి డిజైనర్ బ్రాండ్
కొత్త దుస్తుల శ్రేణిని రూపొందించింది. ప్రధానంగా భారతీయ హిందూ మహిళలకు
విక్రయించేందుకు ఉద్దేశించిన ఆ దుస్తుల ప్రమోషన్ కోసం ఒక ప్రకటన రూపొందించారు.
దాన్ని డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ తన సోషల్ మీడియాలో విడుదల చేసారు. ఐతే ఆ ప్రకటనలో
మోడల్స్‌ను చూపించిన విధానంపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఆ ప్రకటనలో యువతులు సరికొత్త
చీరెల కలెక్షన్ ధరించి ప్రదర్శిస్తున్నారు. కానీ ఏ ఒక్కరి ముఖంలోనూ ఎలాంటి భావమూ కనిపించడం
లేదు. తీవ్రమైన బాధ అనుభవిస్తున్న వారిలా, చీరెలు ధరించడం బోర్ కొడుతోందనిపించేలా ఆ
మోడల్స్ ఉన్న తీరు, చాలామందికి చిరాకు కలిగించింది. పైగా, ఏ ఒక్క మోడల్ కూడా
బొట్టు ధరించలేదు. సాధారణంగా భారతీయ మహిళలకు బొట్టు లేకుండా సంప్రదాయిక అలంకరణ ఉండదు.
అది పండుగలు, పెళ్ళిళ్ళూ పేరంటాల సందర్భాలైతే ఇంక చెప్పనే అక్కర్లేదు. అలాంటిది, ‘హెరిటేజ్
బ్రైడల్ 2023’ కలెక్షన్ అని పేరు పెట్టి ఒక్క యువతికి కూడా బొట్టు లేకుండా,
ఏడుపుగొట్టు మొహాలతో వారిని చూపించడం నెటిజెన్లకు ఒళ్ళు మండించింది.
ఆ వీడియోను సోషల్ మీడియాలో
విడుదల చేసిన కొద్దిసేపటికే వినియోగదారులు తమ అసంతృప్తిని కామెంట్ల రూపంలో వెల్లడించడం
మొదలుపెట్టారు. ఎవరో చనిపోతే సంతాపం తెలుపుతున్నట్టు ఉన్నారా మోడల్స్ అంటూ
మండిపడుతున్నారు. ఇది బ్రైడల్ కలెక్షనా లేక ఫ్యునెరల్ కలెక్షనా అని కామెంట్
చేసారు. ఇంక జోక్స్, మీమ్స్కయితే అంతే లేదు.
ఇది డిప్రెషన్ కలెక్షన్ అని ఒక
నెటిజెన్ కామెంట్ చేసారు. ‘‘మోడల్స్ ఎందుకంత నిరాశగా కనిపిస్తున్నారు? ఇదేమైనా
డిప్రెషన్ కలెక్షనా? మోడల్స్ ముఖాన బొట్టు లేదేం? భావప్రకటనా స్వేచ్ఛ పేరిట
పండుగలను అపహాస్యం చేయడానికి అవకాశం లేదు’’ అని ఒక యూజర్ రాసారు.
మరొక నెటిజన్ ‘‘ఏడుపుగొట్టు
మహిళల ప్రపంచానికి స్వాగతం. ఇది సబ్యసాచి సంతాపం స్పెషల్ కలెక్షన్. అంత్యక్రియలకు
హాజరవడానికి ప్రత్యేకమైన డిజైనర్ చీరలు’’ అని కామెంట్ చేసాడు. ‘‘అసలు, వాళ్ళ సమస్య
ఏంటి? మలబద్ధకమా? మొలలా? లేక హెర్నియా సమస్యా?’’ అని ఇంకో నెటిజెన్ ప్రశ్నించారు.
‘‘పోలీస్ స్టేషన్లో ఫొటోలకు
పోజిస్తున్నారా? సబ్యసాచి కలెక్షన్ పేరిట బొట్టు కూడా లేకుండా ఎలాంటి చీరలు
అమ్ముతున్నారు? వాళ్ళకి కనీసం శవాలు నవ్వినట్లయినా నవ్వమని చెప్పండి. ఆధునికత
పేరిట మన సంస్కృతిని పాశ్చాత్యీకరించడం అలవాటైపోయింది’’ అంటూ మరో వ్యక్తి
వ్యాఖ్యానించారు.
గత నెల దసరా పర్వదినం సందర్భంలో నల్లి సిల్క్స్
సంస్థ ప్రకటన కూడా ఇలాగే విమర్శలు ఎదుర్కొంది. బొట్టు లేని ముఖాలతో మోడల్స్‌ను
చూపుతూ పండుగ దుస్తులు విక్రయించే ప్రయత్నం వికటించింది. దాంతో నల్లి సిల్క్స్,
బొట్టు పెట్టుకున్న మహిళలతో మరొక ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. ఇప్పుడు
సబ్యసాచి ముఖర్జీ ప్రకటన కూడా అలాంటి విమర్శలనే ఎదుర్కొంటోంది.