ఢిల్లీలో పెరిగిపోయిన వాయు కాలుష్యం (delhi air polution) కలవరపెడుతోంది. గాలి నాణ్యత క్షీణించడంతో ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. దీపావళి తరవాత నుంచి అంటే 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వాహనాలకు సరి, బేసి విధానం అమల్లోకి తీసుకువస్తున్నట్లు ఆప్ సర్కార్ ప్రకటించింది. వాహనం నంబరు చివరన ఉన్న సంఖ్య ప్రకారం రోడ్ల మీదకు రావాల్సి ఉంటుంది.
ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలలు కూడా మూసివేయాలని నిర్ణయించారు. 10, 12వ తరగతుల వారికి మినహా, అన్ని తరగతుల వారికి నవంబరు 11 వరకు సెలవులు ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రాథమిక పాఠశాలలకు మాత్రమే సెలవులు ప్రకటించగా, ఇక నుంచి ఉన్నత పాఠశాలలను కూడా మూసివేయాలని నిర్ణయించారు. అన్ని తరగతుల వారికి ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే ఢిల్లీలో నిర్మాణ కార్యక్రమాలను నిలిపేశారు. డీజిల్ వాహనాలను రాజధానిలోకి అనుమతించడం లేదు. బీఎస్3 పెట్రోల్, బీఎస్4 డీజిల్ వాహనాలను నిషేధించారు. అత్యవసర వాహనాలు, సీఎన్జీ, ఎల్పీజీతో నడిచే ట్రక్కులను మాత్రమే ఢిల్లీలోకి అనుమతిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో 50 శాతం మందిని ఇంటి వద్ద నుంచే పనిచేయించుకోవాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.