Srilanka Cricket Board
Sacked
క్రికెట్ వరల్డ్ కప్ టోర్నమెంట్లో శ్రీలంక
జట్టు సరిగ్గా రాణించలేకపోవడంపై ఆ దేశ క్రీడాశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ చేతిలో
ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో తమ దేశపు క్రికెట్ బోర్డునే రద్దు చేసేసింది.
తాత్కాలికంగా ఒక కమిటీని నియమించింది.
శ్రీలంక జాతీయ క్రికెట్ బోర్డును రద్దు
చేస్తున్నట్టు దేశ క్రీడాశాఖ మంత్రి రోషన్ రణసింగే ప్రకటించారు. అర్జున రణతుంగ
నాయకత్వంలో తాత్కాలికంగా ఒక మధ్యంతర బోర్డును ఏర్పాటు చేసారు. ఏడుగురు సభ్యుల
కొత్త బోర్డులో లంక సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, క్రికెట్ బోర్డ్ మాజీ
అధ్యక్షుడు కూడా సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే ఆదివారం నాడు బోర్డు కార్యదర్శి మోహన్
డిసిల్వా రాజీనామా చేసారు. శ్రీలంక క్రికెట్ బోర్డ్ తీవ్రమైన అవినీతి ఆరోపణలు
ఎదుర్కొంటోంది. దేశ ఆర్థిక పరిస్థితి తలకిందులైపోయిన సమయంలో కూడా క్రికెట్
బోర్డులో అవినీతికి పట్టపగ్గాల్లేవన్న తీవ్ర విమర్శలు ఉన్నాయి.
వరల్డ్ కప్‌లో
భారత్‌తో మ్యాచ్‌లో కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయి, 302 పరుగుల తేడాతో శ్రీలంక ఓడిపోయింది.
ఆ ఘోర పరాజయంపై క్రీడామంత్రి రోషన్ రణసింగే మండిపడ్డారు. క్రికెట్ బోర్డు అధికారులందరూ తక్షణమే రాజీనామా చేయాలని బహిరంగంగా
డిమాండ్ చేసారు. వారు బోర్డులో కొనసాగే నైతిక అర్హత కోల్పోయారని విమర్శించారు.
రణసింగే శనివారం నాడు ఐసీసీకి
లేఖ రాసారు. సాధారణంగా క్రికెట్లో రాజకీయ జోక్యం ఉండకూడదన్నది ఐసీసీ నిబంధన.
అయితే తమ దేశపు బోర్డు పరిస్థితిని అర్ధం చేసుకుని తమ నిర్ణయాన్ని సమర్ధించాలంటూ
రణసింగే తన లేఖలో కోరారు. ‘‘శ్రీలంక క్రికెట్లో ఆటగాళ్ళ క్రమశిక్షణ, బోర్డు
అవినీతి, ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఫిర్యాదులు
వెల్లువెత్తుతున్నాయి’’ అంటూ ఆ లేఖలో రాసారు. ఆ లేఖపై ఐసీసీ ఇంకా స్పందించలేదు.
గతనెలలో బోర్డులో అవినీతిపై ఫిర్యాదులను
దర్యాప్తు చేయడానికి ముగ్గురు సభ్యుల ప్యానెల్‌ను మంత్రి నియమించారు. కానీ, ఐసీసీ దాన్ని
రాజకీయజోక్యంగా భావించి, ప్యానెల్ ఉపసంహరణకు ఒత్తిడి చేసింది.