సినీనటి రష్మిక (Rashmika) మార్ఫింగ్ వీడియో వైరల్‌గా మారింది. తాజాగా రష్మికకు చెందిన ఓ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. డీప్‌ఫేక్ ద్వారా రష్మిక వీడియోను వైరల్ చేయడంపై కేంద్ర ఐటీ శాఖ తీవ్రంగా స్పందించింది. మార్ఫింగ్ వీడియోలను కట్టడి చేయాల్సిన బాధ్యత సోషల్ మీడియాదేనని ఐటీ శాఖ వెల్లడించింది.
రష్మిక డీప్‌నెక్ బ్లాక్ డ్రెస్ వేసుకుని లిఫ్ట్‌లో నుంచి వచ్చిన వీడియోను తయారు చేశారు. వీడియో చూసిన నెటిజన్లు, ప్రముఖులు స్పందించారు. ఇలాంటి వీడియోలు తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ డిమాండ్ చేశారు. ఒరిజినల్ వీడియోను ఓ విలేకరి పోస్ట్ చేశారు. అసలు వీడియోలో ఉన్న నటి జారా పటేల్ అనే యువతిది అని, రష్మిక కాదని స్పష్టం చేశారు. ఇలాంటి ఫేక్ వీడియోలను కట్టడి చేసేందుకు కేంద్రం కఠిన చట్టాలు తీసుకురావాలని కొందరు నెటిజన్లు డిమాండ్ చేశారు.
రష్మిక మార్ఫింగ్ వీడియోపై కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ఇంటర్నెట్ వాడే వారికి భద్రత కల్పించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జారీ చేసిన నిబంధనల ప్రకారం, చట్టపరమైన చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి హెచ్చరించారు. తప్పుడు సమాచారం ఎవరూ కూడా పోస్ట్ చేయకుండా చూసుకోవాలన్నారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోపై స్పందించడానికి తాను ఎంతో బాధపడుతున్నానంటూ రష్మిక భావోద్వేగానికి గురయ్యారు. ఇలాంటి ఘటనలు, తనతోపాటు ఎందరినో ఆందోళనకు గురి చేస్తున్నాయన్నారు. తనకు మద్దతుగా నిలిచిన వారందరిక రష్మిక ధన్యవాదాలు తెలిపారు.