Kerala blasts case accused
remanded to 10days police custody
కేరళలో వరుస బాంబు పేలుళ్ళ కేసు ప్రధాన
నిందితుడు డొమినిక్ మార్టిన్‌కు ఎర్నాకులం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్ట్ పది రోజుల
పోలీస్ కస్టడీ విధించింది. ఈ ఉదయం కొచ్చి పోలీసులు డొమినిక్ మార్టిన్‌ని వైద్య
పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు.
న్యాయస్థానం మార్టిన్‌కు పది రోజుల
పోలీస్ కస్టడీ విధించింది. కేసు దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని డొమినిక్
మార్టిన్ కోర్టులో చెప్పాడు.
కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడు
పేలుడు పదార్ధాలను ఎలా సంపాదించాడు, అతని ఆర్థిక వనరులేమిటి, సాంకేతికంగా ఎవరైనా
సాయం చేస్తున్నారా, నిందితుడికి ఏమైనా అంతర్జాతీయ సంబంధాలున్నాయా వంటి వివరాలు
తెలుసుకోవలసి ఉందని పోలీసులు న్యాయస్థానానికి చెప్పారు. కనీసం పది ప్రదేశాల నుంచి
ఆధారాలు సేకరించాల్సి ఉందని వివరించారు.
నిందితుడికి న్యాయసహాయం ఏమైనా కావాలా అని
కోర్టు అడిగింది. అలాంటిదేమీ అవసరం లేదంటూ నిందితుడు తిరస్కరించాడు. అవసరమైనప్పుడు
న్యాయసహాయం పొందే అవకాశముందని చెబుతూ న్యాయస్థానం అతనికి నవంబర్ 15 వరకూ పోలీస్
కస్టడీకి అప్పగించింది.
నిందితుడు చాలా తెలివైనవాడని, మంచి
ఉద్యోగం చేస్తుండేవాడనీ పోలీసులు కోర్టుకు చెప్పారు. అతనికి ఎవరూ బ్రెయిన్‌వాష్
చేయలేదని వివరించారు. నిందితుడు రిమోట్ కంట్రోల్ సాయంతో ఐఈడీ బాంబులు పేల్చాడని న్యాయస్థానానికి
తెలియజేసారు.
నిందితుడి వద్ద పేలుళ్ళకు వాడిన ఐఈడీ కొనుగోలుకు
సంబంధించిన బిల్లులన్నీ ఉన్నాయి. తాను వస్తువులు కొన్న ప్రదేశాలను సైతం వీడియోలు తీసాడు.
ఘటన తర్వాత తానే ఆ పనికి పాల్పడ్డానని వివరిస్తూ వీడియో తీసి ఫేస్బుక్లో పోస్ట్
చేసాడు.
ఆ పేలుళ్ళలో తీవ్రంగా గాయపడిన
61ఏళ్ళ మహిళ ఈ ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దాంతో ఈ కేసులో మృతుల
సంఖ్య 4కు పెరిగింది.