Israeli model hid under boyfriend’s deadbody during Hamas attack
గత నెలలో ఇజ్రాయెల్ భూభాగంపై హమాస్
ఉగ్రవాదులు, పాలస్తీనా సాయుధులు ఆకస్మిక దాడి చేసారు. ఇజ్రాయెలీలు దిగ్భ్రాంతి
నుంచి తేరుకోక ముందే అక్కడి ప్రజలను కిడ్నాప్ చేసి గాజా ప్రాంతానికి తరలించారు. ఆ
తర్వాత ఇజ్రాయెల్ ప్రతిదాడులు మొదలుపెట్టింది. హమాస్‌ను తుదముట్టించేంతవరకూ యుద్ధం
కొనసాగుతుందంటూ దాడులు చేస్తోంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రతిదాడులను వారు
తప్పుపడుతున్నారు.
హమాస్ ఉగ్రవాదులు, పాలస్తీనియన్ల దాడులకు
సంబంధించిన వివరాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇజ్రాయెల్‌లో ఒక
సంగీతోత్సవం జరుగుతున్న ప్రదేశంపై దాడి చేసి, అక్కడ కనీసం 250 మంది సాధారణ పౌరులను
హతమార్చారు. అక్కడ ప్రాణాలు దక్కించుకున్న ఒక మోడల్, ఆనాటి దారుణాన్నివివరించింది.
అక్టోబర్ 7న సూపర్‌నోవా పేరుతో మ్యూజిక్
ఫెస్టివల్ జరుగుతోంది. ఆ కార్యక్రమానికి హాజరు కావడానికి 27ఏళ్ళ మోడల్ నవోమ్ మజాల్
బెన్ డేవిడ్, తన బోయ్‌ఫ్రెండ్ డేవిడ్ నేమాన్‌తో కలిసి వెళ్ళింది. వారు అక్కడికి
ఉదయం ఆరున్నరకల్లా చేరుకున్నారు. కార్యక్రమం ప్రారంభమైన కాసేపటికి ఉన్నట్టుండి
పేలుళ్ళు వినిపించాయి.
‘‘వెంటనే మేము మా కారులోకి చేరుకున్నాం.
అక్కణ్ణుంచి బైటపడడానికి ప్రయత్నించాం. కానీ అప్పటికే వారు బైటకు వెళ్ళే దారులు
అన్నింటినీ మూసివేసారు. దాంతో మేం లోపల ఇరుక్కుపోయాం. బైటకు వెళ్ళే దారి లేదు. ఒక
సెక్యూరిటీ గార్డ్ పరుగెత్తుకుని వెడుతూ ‘మీ ప్రాణాలు కాపాడుకోండి’ అని అరిచారు. వాళ్ళు
ఆటోమేటిక్ గన్స్‌తో విచక్షణారహితంగా ప్రతీ ఒక్కరి మీదా ఆటోమేటిక్ గన్స్‌తో
కాల్పులు జరుపుతూ ఉన్నారు’’ అని నవోమ్ మజాల్ చెప్పారు.
నవోమ్, డేవిడ్ జంట మరో 14మందితో కలిసి ఒక
పెద్ద డస్ట్‌బిన్‌లో తలదాచుకున్నారు. మూడు గంటల పాటు ఆ డస్ట్‌బిన్‌లో
దాక్కున్నారు. ఆ తర్వాత ఒక పాలస్తీనియన్ సాయుధుడు వారిని కనుగొన్నాడు. వెంటనే నవోమ్
ప్రియుడి ఛాతీ మీద కాల్పులు జరిపాడు. నవోమ్‌కు కాలి మీద, హిప్ మీద తుపాకీగుళ్ళు
తగిలాయి.
‘‘వాళ్ళు మమ్మల్ని చుట్టుముట్టారు.
నలువైపుల నుంచీ కాలుస్తూనే ఉన్నారు. నిరవధికంగా కాల్చారు. ఒక చిన్నపిల్ల ఏడవడం
నేను విన్నాను. ‘నన్ను తీసుకువెళ్ళొద్దు, నన్ను వదిలేయండి’ అంటూ ఆ పిల్ల ఏడ్చింది.
కానీ వాళ్ళు ఆమెను కిడ్నాప్ చేసారు. ఆమెను భయంకరంగా చిత్రవధల పాలు చేసారు. మేము మా
కుటుంబాలకు, స్నేహితులకూ ఫోన్లు చేస్తూనే ఉన్నాము. మా లొకేషన్ షేర్ చేసి, సాయం
కోసం అడుక్కున్నాము’’ అని చెప్పిందామె.
తీవ్రంగా గాయపడిన నవోమ్, ఆ డంప్‌స్టర్‌లోనే
ఉండిపోయింది. అక్కడ గుట్టలు గుట్టలుగా శవాలు పడి ఉన్నాయి. వాటి కింద ఆమె మౌనంగా
ఉండిపోయింది. అక్కడ దాగివున్న సుమారు 16మందిలో కేవలం నలుగురు మాత్రమే బతకగలిగారు.
మిగతావారందరూ చనిపోయారు. సాయుధ దుండగులు అక్కడున్న వారిని వెతికారు. ఆ శవాల
గుట్టలో తన ప్రియుడు, మరికొందరి మృతదేహాల కింద ఉన్న నవోమ్ అదృష్టవశాత్తు వారికి దొరకలేదు.
మరికొన్ని గంటల తర్వాత ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అన్వేషణలో ఆమె కనిపించింది.
వారామెను సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్ళి ప్రథమ చికిత్స చేసారు.
సూపర్‌నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌కు
వేలమంది యువతీ యువకులు హాజరయ్యారు. పాలస్తీనా సాయుధులు సరిహద్దులు దాటి ఇజ్రాయెల్
భూభాగంలోకి చొరబడి దాడులు చేసారు. మోటార్‌సైకిళ్ళు, పికప్ ట్రక్కులు, స్పీడ్
బోట్స్, మెకనైజ్డ్ గ్లైడర్స్… ఇలా ఏదో ఒక వాహనంతో మీదపడిపోయారు. కొన్ని దశాబ్దాల
తర్వాత ఇజ్రాయెల్ మీద జరిగిన భయంకరమైన దాడి అది.
అలాంటి అమానుషమైన దాడికి
పాల్పడిన దుర్మార్గులు ఇప్పుడు ఇజ్రాయెల్ దళాలు ప్రతిదాడులకు పాల్పడుతుంటే
శాంతివచనాలు పలుకుతున్నారు. గాజా స్ట్రిప్‌లోని అమాయక పౌరుల ప్రాణాలు తీయడం
సరికాదంటూ సుద్దులు చెబుతున్నారు. ఇస్లామిక్ దేశాలు, సోకాల్డ్ సెక్యులర్
అభ్యుదయవాదులు వారికి మద్దతు పలుకుతున్నారు.