విజయవాడ బస్టాండ్‌లో జరిగిన బస్సు ప్రమాద (bus accident) ఘటనపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సీఎం రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. ప్రమాద ఘటనపై అధికారుల నుంచి సీఎం వివరాలు అడగి తెలుసుకున్నారు.
ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తూ ఫ్లాట్‌ఫాం మీదకు దూసుకుపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు సీఎంకు వివరించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై విచారణ చేయాలని ఆదేశించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు వెంటనే పరిహారం అందించాలని, గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం ఆదేశాలు జారీచేశారు.
బస్సు ప్రమాదంపై ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు స్పందించారు. ఆటోనగర్ డిపోకు చెందిన బస్సు ప్రమాదానికి గురైనట్లు ఆర్టీసి ఎండీ చెప్పారు. 24 మంది ప్రయాణికులతో బయల్దేరుతుండగా ప్లాట్‌ఫామ్ మీదకు దూసుకు వచ్చిందని తెలిపారు. కుమారి అనే ప్రయాణికురాలితో పాటు బస్సు ముందు నిలబడి ఉన్న ఔట్ సోర్సింగ్ కండక్టర్ ఘటనా స్థలంలోనే చనిపోయినట్లు ఆర్టీసీ ఎండీ వెల్లడించారు.మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందించారు.
బస్సు ప్రమాదానికి మానవ తప్పిదమా, సాంకేతిక లోపాలా అనేది తెలియాల్సి ఉందని ఎండీ చెప్పారు. బ్రేక్ ఫెయిల్ అయ్యిందా, డ్రైవర్ పొరపాటు చేశాడా అనేది దర్యాప్తులో తేలుతుందన్నారు.ప్రమాదం జరిగినపుడు బస్సు ఏ గేర్‌లో ఉందనేది తెలియాల్సి ఉందన్నారు.
ప్రమాదంలో చిన్నారి అయాన్ష్ కూడా ప్రాణాలు కోల్పోయిందని, మరో ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయని ఎండీ మీడియాకు చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాదంలో గాయపడిన సురేష్‌బాబు, సుకన్యలకు చికిత్స ఖర్చులను ఆర్టీసీ అందిస్తుందని ఎండీ ప్రకటించారు. బస్టాండ్ ప్రాంగణంలో పరిమిత వేగంలో ప్రయాణించాలనే నిబంధన అమల్లో ఉన్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారాకా తిరుమలరావు స్పష్టం చేశారు.