బెంగళూరులో దారుణ హత్య (crime news) చోటుచేసుకుంది. కర్ణాటక ప్రభుత్వంలో పనిచేస్తోన్న మహిళా అధికారిణి ప్రతిమను గుర్తుతెలియని దుండగులు దారుణంగా పొడిచి చంపారు. గనుల శాఖలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తోన్న ప్రతిమను డ్రైవర్ ఇంటి వద్ద దింపి వెళ్లిన కాసేపటికే హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
బెంగళూరులోని తీర్థహళ్లిలో ప్రతిమ, భర్త పిల్లలతో కలసి ఎనిమిదేళ్లుగా నివశిస్తోందని స్థానికులు తెలిపారు. భర్త, పిల్లలు ఇంట్లో లేని సమయంలో ఈ ఘోరం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున సోదరుడు ఇంటికి వచ్చి చూడగా విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె ఎత్తకపోవడంతో సోదరుడు ప్రతిమ ఇంటికి వచ్చి పరిశీలించగా హత్య విషయం వెలుగు చూసింది. ప్రతిమ హత్యకు కారణాలు మాత్రం తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.