కెనడాలో హత్యకు గురైన ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య (nijjar murder case) కేసు దర్యాప్తును ఆ దేశ సీనియర్ అధికారి పక్కదారి పట్టించాడని భారత హైకమిషనర్ సంజీవ్ వర్మ ఆరోపించారు. నిజ్జర్ హత్యలో భారత ఏజంట్ల హస్తం ఉందన్న కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలను బలపరిచే ఆధారాలుంటే సమర్పించాలని సంజీవ్ వర్మ డిమాండ్ చేశారు. కెనడా పోలీసుల దర్యాప్తును ప్రభావితం చేసేలా అత్యన్నత స్థాయిలో అధికారులు బహిరంగ ప్రకటనలు చేయడాన్ని వర్మ తప్పుపట్టారు.
నిజ్జర్ హత్యలో భారత్ హస్తముందనేందుకు అవసరమైన ఆధారాలను ఒక్కటి కూడా ఇవ్వలేదని వర్మ గుర్తుచేశారు. దర్యాప్తు మొత్తాన్ని తారుమారు చేశారని ఆయన ఆరోపించారు. నిజ్జర్ హత్యలో భారత్ ఏజంట్లు ఉన్నట్లు చెప్పాలని కెనడాలోని అత్యున్నత స్థాయి అధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయని వర్మ వెల్లడించారు.
తనకు, తన సహ సిబ్బందికి కూడా కెనడాలో ముప్పు ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నా భద్రత విషయంలో ఆందోళనగా ఉన్నాను. కాన్సుల్ జనరల్స్ రక్షణ కూడా భయపెడుతోందన్నారు. మాకేమైనా జరిగితే భగవంతుడే కాపాడాలంటూ… సంజీవ్ వర్మ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.