గాజాలో కాల్పుల (gaza seizefire) విరమణ పాటించాలంటూ పాలస్తీనాకు అనుకూలంగా లండన్, పారిస్, బెర్లిన్లలో ప్రజలు భారీ ర్యాలీలు నిర్వహించారు. లండన్‌లో నిర్వహించిన ర్యాలీలో 30 వేల మంది పొల్గొన్నారు. అక్టోబరు 6న ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు ఆకస్మిక దాడి చేసిన తరవాత చోటు చేసుకున్న యుద్ధంలో ఇప్పటి వరకు మొత్తం 9500 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువగా చిన్నారులు, మహిళలు ఉన్నారు.
గాజాలో కాల్పుల విరమణ పాటించాలంటూ ఐరోపాలో నిరసనలు పెరిగాయి. సెంట్రల్ లండన్‌లోని ట్రఫాల్గర్ స్క్వేర్‌లో జరిగిన ర్యాలీకి సుమారు 30 వేల మంది నిరసనకారులు హాజరయ్యారని పోలీసులు తెలిపారు. ర్యాలీలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిలో ఒకరిని అరెస్ట్ చేసి, 11 మందిపై కేసులు నమోదు చేశారు. ఇరాన్, షెఫీల్డ్, మాంచెస్టర్, గ్లాస్గోలో కూడా పాలస్తీనా అనుకూల నిరసనలు వెల్లువెత్తాయి.
పారిస్‌లో 19 వేల మంది నిరసనకారులు ప్రదర్శనలు చేశారు. గాజాలో కాల్పులు నిలిపివేయాలని నిరసనకారులు నినాదాలు చేశారు. టెహ్రాన్‌లో డౌన్ విత్ యుఎస్ఏ, డౌన్ విత్ ఇజ్రాయెల్ అంటూ నినాదాలు చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు బొమ్మలు, అమెరికా జెండాలను నిరసనకారులు దహనం చేశారు.