Danish Kaneria appeal to Irfan Pathan on Hindu Minorities
in Pakistan
గాజాలో పిల్లల దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తూ భారత
క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ చేసిన ట్వీట్‌కి పాకిస్తానీ హిందూ క్రికెటర్ దానిష్
కనేరియా స్పందించాడు. పఠాన్‌కు మద్దతు పలికిన కనేరియా, పాకిస్తాన్లో మైనారిటీలైన
హిందువులు ఎదుర్కొంటున్న కష్టాల గురించి కూడా మాట్లాడాలని కోరాడు.
అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు
మెరుపుదాడులకు పాల్పడ్డారు, సుమారు 250మందిని బందీలుగా తీసుకుపోయారు. దాంతో
ఇజ్రాయెల్ సైన్యం ప్రతిదాడులు ప్రారంభించింది. ఫలితంగా మధ్యప్రాచ్యంలో
యుద్ధవాతావరణం నెలకొంది. ముఖ్యంగా, హమాస్ ఉగ్రవాదుల స్థావరమైన గాజా స్ట్రిప్ మీద
ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. హమాస్ ఉగ్రవాదులు భూగర్భంలోని బంకర్లు, సొరంగాల్లో
తలదాచుకుని ఉండడంతో, ఇజ్రాయెల్ దాడుల్లో గాజాస్ట్రిప్‌లోని సాధారణ ప్రజలు సైతం
మరణిస్తున్నారు. వారిలో స్త్రీలు, పిల్లలు ఉండడంతో ప్రపంచ దేశాల నుంచి సానుభూతి వెల్లువెత్తుతోంది.
ముఖ్యంగా ఇస్లామిక్ దేశాలు యుద్ధానికి కారణమైన హమాస్ దాడిని పక్కకు నెట్టేసి,
ఇజ్రాయెల్ ప్రతిదాడుల్లో చనిపోయిన చిన్నారుల విషయాన్ని ప్రధాన చర్చనీయాంశం
చేస్తున్నారు. వాటికి సినీనటులు, క్రీడాకారులు మద్దతు పలుకుతున్నారు.
ఆ నేపథ్యంలోనే ఇర్ఫాన్ పఠాన్ శుక్రవారం నాడు తన
ఎక్స్ హ్యాండిల్లో గాజాలో పిల్లల పరిస్థితిపై ట్వీట్ చేసాడు. ‘‘గాజాలో ప్రతీరోజూ
పదేళ్ళలోపు పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. వారి విషయంలో ప్రపంచం మౌనంగా ఉంది.
ఒక క్రీడాకారుడిగా నేను కేవలం మాట్లాడగలను, అంతే. కానీ ప్రపంచ నాయకులందరూ ఐక్యంగా
నిలబడి, మతిమాలిన ఈ హత్యలకు ముగింపు పలకాలి’’ అని ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేసాడు.
పాకిస్తాన్‌కు చెందిన హిందూ క్రికెట్
క్రీడాకారుడు దానిష్ కనేరియా ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్‌ను ప్రశంసించాడు. ‘‘ఇర్ఫాన్
భాయ్, పిల్లల బాధను మీరు అర్ధం చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ విషయంలో నేనూ
మీతో ఉన్నాను. అయితే, దయచేసి మీరు పాకిస్తాన్‌లోని హిందువుల గురించి కూడా
మాట్లాడండి. ఇక్కడ పాకిస్తాన్లో హిందువుల పరిస్థితి (గాజాలో పిల్లల పరిస్థితి
కంటె) తేడాగా ఏమీ లేదు’’ అని స్పందించాడు.
దానిష్ కనేరియా పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు
అంతర్జాతీయస్థాయిలో ఆడిన రెండవ హిందూ క్రీడాకారుడు. కేవలం హిందువు అయిన కారణానికి
చాలామంది పాక్ క్రికెటర్ల నుంచి వివక్షను ఎదుర్కొన్నాడు. ఆ కారణం చేతనే అతనికి ఇంటర్నేషనల్
క్రికెట్ ఆడే అవకాశాలు కూడా ఎక్కువ రాలేదు. దానిష్ కనేరియా ప్రస్తుతం పాకిస్తాన్లో
మైనారిటీలుగా ఉన్న హిందువులు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రధానంగా
ప్రస్తావిస్తున్నాడు.