ఎన్నికల
సమయం ఆసన్నం కావడంతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పాలక
వైసీపీ ప్రభుత్వ విధానాలలోని లొసుగులను కమలదళం ఎత్తిచూపుతోంది. కేంద్రం నుంచి
రాష్ట్రానికి అందుతున్న సాయాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రజలకు వివరించడం లేదని ఆ
పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రం చొరవతో రాష్ట్రంలో పలు
అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే వాటిని వైసీపీ తన ఖాతాలో వేసుకుంటోందని దుయ్యబడుతున్నారు.
బీజేపీ,
వైసీపీ మధ్య పరస్పర రాజకీయ విమర్శలు దారి తప్పాయి. పార్టీల సిద్ధాంతాలు మధ్య
జరగాల్సిన చర్చ, విమర్శలు వ్యక్తిగత
స్థాయికి దిగజారాయి. రాజకీయ విమర్శలు కాస్తా వ్యక్తిగత ఆరోపణలకు దారితీశాయి. నేతల
వైఖరి కారణంగా బీజేపీ, వైసీపీలకు ప్రజాక్షేత్రంలో తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం
కనిపిస్తోంది.
వైసీపీ
ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం విక్రయాల్లో అక్రమాలపై విచారణ కోసం బీజేపీ డిమాండ్
చేస్తోంది. పురందరేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పటి
నుంచి ఈ విషయాన్ని హైలైట్ చేస్తున్నారు.
ప్రభుత్వ పెద్దలే బినామీలుగా మద్యం తయారీ
కంపెనీలు నడిపిస్తున్నారని ఆరోపించారు.
బీజేపీ
చేసిన ఆరోపణలపై రాష్ట్రప్రభుత్వం అధికారికంగా స్పందించకపోవడంతో ఆమె కేంద్రానికి
ఫిర్యాదు చేశారు. సీబీఐ విచారణ చేపట్టాలని కోరారు.
మద్యం
కంపెనీల అధినేతలను బెదిరించి వైసీపీ నేతలు టేకోవర్ చేసుకున్నారని పురందరేశ్వరి
చెబుతున్నారు. వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో పలు
కంపెనీలు నడుస్తున్నాయన్నారు.
పురందరేశ్వరి
చేసిన ఆరోపణలను విజయసాయిరెడ్డి ఖండించారు. ఇద్దరి మధ్య పరస్పర ఆరోపణల తీవ్రత
పెరిగింది.
చంద్రబాబుతో
చుట్టరికాన్ని సాకుగా చూపుతూ విజయసాయిరెడ్డి సహా ఇతర వైసీపీ నేతలు పురందరేశ్వరిపై
సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారు. ఆమె సామాజికవర్గం మేలు కోసమే
పనిచేస్తున్నారనేలా ట్రోల్ చేస్తున్నారు.
వైఎస్
జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 గా ఉన్న విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీజేఐకు
పురందరేశ్వరి లేఖ రాశారు. ఎంపీ హోదాలో విజయసాయిరెడ్డి అధికార దుర్వినియోగానికి
పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్న పురందరేశ్వరి, బెయిల్ షరతులు
ఉల్లంఘిస్తున్నారన్నారు.
పురందరేశ్వరి
పదవుల కోసమే బీజేపీ లో చేరారని, ఆ పార్టీని టీడీపీకి తాకట్టు పెట్టడానికి
పనిచేస్తున్నారని విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నాలుగు
పార్టీలు మారిన చరిత్ర పురందరేశ్వరిది అని, ఆమె కారణంగా బీజేపీకి ఒక్క ఓటు అయినా
అదనంగా వచ్చిందా అని ప్రశ్నించారు.
ఎయిర్
ఇండియా ఇండిపెండెంట్ డైరెక్టర్ గా కేంద్రంలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆ
విమానయాన సంస్థ అమ్మకం విషయంలో మధ్యవర్తిత్వం చేసి ఆ సంస్థ నుంచి ముడుపులు
తీసుకున్నది వాస్తవం కాదా? అని ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
లో మద్యం స్కాం అంటూ ఆరోపణలు చేసిన పురందరేశ్వరి భర్త, కుమారుడు మద్యం సిండికేట్
బ్రోకర్ల నుంచి ముడుపులు తీసుకున్నారని
ఆరోపించారు.